KCR Press Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ”రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను బహిష్కరిస్తున్నా. ఇది బాధాకరమే. అయినా.. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నా. బహిరంగ లేఖ ద్వారా పీఎం మోడీకి దీన్ని తెలియజేస్తున్నా. స్వాతంత్ర్యానంతరం భారతావని ఏవిధంగా ఉండాలనేదానిపై చర్చోపచర్చలు జరిగాయి. ఏ దేశమైనా, ఏ సమాజమైనా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండాలని నిర్ణయించారు.
తద్వారా వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు ఉండాలని భావించారు. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్రణాళికా సంఘం ఉనికిలోకి వచ్చింది. దాని ఫలితమే దేశంలో ఎన్నో ఉన్నత సంస్థలు ఏర్పడ్డాయి. ప్రణాళికా సంఘంలో ఎంతో మంది గొప్పోళ్లు ఉండేవాళ్లు. మన దేశానికి అనుగుణమైన అనేక నిర్ణయాలు తీసుకునేవారు. 1985లో నేను ఎమ్మెల్యే అయ్యా. అప్పట్లో ఎన్టీఆర్ సీఎంగా ఉండేవారు. ఆయన మా నియోజకవర్గానికి రూ.8 లక్షలు కేటాయించారు. కానీ పీపీఏసీ అనే కమిటీ రూ.5 లక్షల లోపే ఉండాలని షరతు పెట్టింది. క్రమబద్ధమైన ప్రణాళికకు ఇదొక ఉదాహరణ.
ఎస్‌కే డే గారి చేతిలో నెహ్రూ మన గ్రామీణ భారతాన్ని పెట్టారు. ప్రణాళికాబద్ధమైన డెవలప్‌మెంట్, పురోగతి, విశాల ప్రయోజనాల కోసం ఇలాంటివెన్నో ఏర్పాటుచేశారు. తదనంతర కాలంలో మోడీ ప్రధాని అయ్యారు. ఆయన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ని తెచ్చారు. ఇందులో సీఎంలందరూ ఉంటారని చెప్పారు. దాన్ని టీమిండియాగా అప్పట్లో అభివర్ణించారు. నేను చాలా సంతోషపడ్డా. ఆశపడ్డా. దేశానికి మంచి రోజులు వచ్చాయని భావించా. కానీ బ్యాడ్‌లక్. నీతి ఆయోగ్ పేరుకే ఒక సంస్థలాగా మిగిలిపోయింది.
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో నీతి ఆయోగ్‌లో నీతి కూడా అంతే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. 8 ఎనిమిదేళ్ల నీతి ఆయోగ్ ఏమీ సాధించలేకపోయింది. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం అమలుచేయలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ పెట్టుబడి వ్యయం డబుల్ అయింది. కేంద్రానివన్నీ ఏకపక్ష నిర్ణయాలే. దేశంలో మంచి నీళ్లు లేని పరిస్థితి. దేశ రాజధానిలో కూడా నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. పంట పండించుకోవటానికి నీళ్లు దొరకని దుస్థితి. పనిచేసుకుందామంటే ఉద్యోగం దొరకట్లేదు. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. దేశంలో ద్వేషం, అసహనం పెరిగిపోయింది” అని సీఎం కేసీఆర్ అన్నారు.