Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..

Ntv

Ntv

Work From Home: ఇటీవల ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన పొదుపు, స్కూల్స్‌లో ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్, బంగారం కొనుగోలుపై అనేక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందని అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచ అనిశ్చితి, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలకు లేదా ఐటీ రంగానికి ప్రభుత్వం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) తప్పనిసరి చేయబోతోందంటూ జరుగుతున్న ప్రచారానికి కేంద్రం తెరదించింది. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది. కంపెనీలకు అటువంటి ఆదేశాలు జారీ చేసే ఆలోచన ఏదీ లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన విజ్ఞప్తిని కొన్ని వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని, అది సరైనది కాదని అధికారులు వివరించారు.

ప్రధాని మోడీ తన ప్రసంగంలో.. సాధ్యమైనంత వరకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలు, దిగుమతులపై ఖర్చులను నివారించాలని సూచించారు. ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, వీలైనప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వర్చువల్ మీటింగ్స్ ద్వారా ప్రయాణాలను తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఇది కేవలం పౌరులు, సంస్థలు తమ వనరులను బాధ్యతాయుతంగా, పొదుపుగా వాడుకోవాలని చేసిన విజ్ఞప్తి మాత్రమే తప్ప, ప్రభుత్వ పరంగా విధిస్తున్న నిబంధన కాదని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే ఈ విజ్ఞప్తి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా అధికారులు అభివర్ణించారు. సాధారణంగా ‘పొదుపు చర్యలు’ అంటే సంక్షేమ పథకాలపై కోతలు విధించడం లేదా మౌలిక సదుపాయాల పెట్టుబడులను తగ్గించడం అని అర్థం వస్తుందని, కానీ ప్రభుత్వం అటువంటివేమీ చేయట్లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇక అధికారులు వివరణతో రహదారులు, రైల్వేలు, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రభుత్వం తన పెట్టుబడులను యధావిధిగా కొనసాగిస్తోందని, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా వెనక్కి తీసుకోవడం లేదని స్పష్టమైంది. అనేక కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయాణ విధానాలను సమీక్షించుకుని, వర్చువల్ మీటింగ్స్‌ను ప్రోత్సహిస్తున్నప్పటికీ.. అవి ఆయా సంస్థలు తీసుకుంటున్న స్వంత నిర్ణయాలే తప్ప, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు కావని తేలిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక అప్రమత్తత, స్మార్ట్ వినియోగం అవసరమే తప్ప, అభివృద్ధిని అడ్డుకునే ఆంక్షలు కాదని ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది.