కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో పర్యాటక రంగం ఊపందుకుంది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తున్నారు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా, విధిగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే ప్రాంతాల్లో మాస్క్ తీయకూడదని ప్రభుత్వాలు మోరపెట్టుకుంటున్నాయి. అయినా, ప్రజలు షరామామూలుగా మారిపోయారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. తిరిగి అదే నిర్లక్ష్యం ప్రజల్లో కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు నిత్యం టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కరోనా ఆంక్షలు సడలించడంతో ధర్మశాలకు టూరిస్టులు పోటెత్తారు.
Read: ఆ దేశంలో మరోసారి ఎమర్జెన్సీ విధింపు… వరసగా ఇది నాలుగోసారి…
దీంతో ఆక్కడ రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. వందలాది మంది మాస్కులు లేకుండా తిరుగుతుండటం గమనించిన ఐదేళ్ల అమిత్ అనే చిన్నారి ప్లాస్టిక్ స్టిక్ పట్టుకొని పోలీస్‌లా మారిపోయాడు. మాస్క్ లేకుండా తిరుగుతున్న ప్రజలను మాస్క్ పెట్టుకోవాలని సూచించాడు. మాస్క్ పట్ల చిన్నారికి ఉన్న అవగాహన పెద్దవాళ్లకు లేకుండా పోయింది. చిన్నపిల్లవాడు మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నా, పెడచెవిన పెట్టి తిరుగుతున్నారు. బెలూన్లు అమ్ముతూ కుటుంబానికి సహాయంగా ఉంటున్నఐదేళ్ల చిన్నారి మాస్క్ పై ప్రజలను హెచ్చరిస్తున్న తీరు ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నారి వీడియో వైరల్‌గా మారింది.