టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏపీ అసెంబ్లీలో ఆమె మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా ప్రసంగించారు. సింహంతో వేట.. జగన్‌తో ఆట మంచిది కాదని.. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదా అని ఆడపిల్ల పుట్టుకను చంద్రబాబు అవమానించారని… కానీ ఇప్పుడు అదే మహిళలు చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా తీర్పు చెప్పారని రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఏవి జరిగినా మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని… వారు ఎవరికి ఓట్లు వేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మూడు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మహిళలకు ఏం ఒరగబెట్టాడని రోజా ప్రశ్నించారు. మహిళలకు గౌరవం తెచ్చే పనులు చేయకుండా మహిళా ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయాడని ఎద్దేవా చేశారు.
Read Also: మనదేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీ ఇదే..!!
40 ఏళ్ల నుంచి బాబు ప్రజలను మోసం చేస్తున్నాడని రోజా ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ వీధి రౌడీల్లాగా వ్యవహరించారని, గల్లీ గల్లీ తిరిగి పరుగెత్తినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. తట్టాబుట్టా సర్దుకుని చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌కు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని రోజా సెటైర్లు వేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు చంద్రబాబుకు సహకరించిన కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. దీంతో టీడీపీ దుకాణం బంద్ అయ్యిందన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు కట్టుకున్న కుప్పం కోటను తమ సీఎం జగన్ బద్దలు కొట్టారని రోజా వ్యాఖ్యానించారు. ఇంకా చంద్రబాబుకు, ఆయన తనయుడు చిట్టినాయుడికి రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. లోకేష్ ఈ మధ్య తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడని… ఇటీవల కుప్పం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన లోకేష్.. ‘కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా’ అంటూ వ్యాఖ్యలు చేశాడన్నారు. కుప్పం గడ్డ ఇప్పుడు చంద్రబాబు అడ్డా కాదని.. ఐస్ గడ్డ అని రోజా అన్నారు. ఎందుకంటే క్రమంగా కుప్పం ఐస్ గడ్డ కరిగిపోతూ వస్తుందని చంద్రబాబుకు తెలిసేలా చేశామన్నారు. చరిత్ర సృష్టించిన జగన్‌కు హ్యాట్సాఫ్‌కు చెప్తున్నానని రోజా పేర్కొన్నారు.