NTV Telugu Site icon

భారత క్రికెట్ టీం లో గొడవలు..అసలేం జరుగుతుంది ?

ఆటగాళ్లు ఆటపై దృష్టిపెట్టాలి.. బీసీసీఐ టీమ్‌ మేనేజ్‌ మెంట్, టూర్‌లు, బిజినెస్‌ సంగతి చూడాలి. ఇక్కడ ఆ డివిజన్‌లో క్లారిటీ మిస్సయింది. ఇగోలు, పవర్‌ గేమ్‌ లు మొదలయ్యాయి. ఆటగాళ్లను కంట్రోల్‌ చేయాల్సిన బీసీసీఐ కంట్రోల్ తప్పుతోందా? లేని వివాదాలు సృష్టిస్తూ ప్లేయర్ల మధ్య గ్యాప్‌ పెంచుతోందా?

భారత్‌ క్రికెట్‌ జట్టులో జరుగుతున్న పరిణామాలు… దేశ పరువును పొగొట్టేలా ఉన్నాయి. ప్లేయర్ల మధ్య భేదాభిప్రాయాలు వస్తే సరిదిద్దాల్సిన కెప్టెన్లే… ఇప్పుడు గొడవపడుతున్నారు. టీం ఇండియా కెప్టెన్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీరి విభేదాలు… టీం ప్లేయర్లపైనా ప్రభావం చూపుతోంది.

కెప్టెన్సీ విభజన భారత క్రికెట్‌లో కొత్త చిచ్చురేపింది. రెండేళ్ల నుంచి కోహ్లీ, రోహిత్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. ఇప్పుడు కెప్టెన్సీ విభజన ఆ వార్‌పై పెట్రోల్ పోసినట్లయింది.
గత వారం కెప్టెన్సీ విభజనతో భారత సెలెక్టర్లు ఈ దుమారానికి బీజం వేయగా.. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరిపోయింది. దక్షిణాఫ్రికా గడ్డపైకి ఈ వారం వెళ్లనున్న భారత్ జట్టు అక్కడ డిసెంబరు 26 నుంచి మూడు టెస్టుల సిరీస్, జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్‌ని ఆడనుంది. ఈ మేరకు టెస్టు టీమ్‌ని కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వన్డే టీమ్‌ని కెప్టెన్‌గా రోహిత్ శర్మ నడిపిస్తారని భారత సెలెక్టర్లు స్పష్టం చేశారు. దాంతో.. ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఎలా ఆడతారో చూడాలని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ.. రోజు వ్యవధిలోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

సఫారీ పర్యటన ముంగిట ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ.. టెస్టు సిరీస్‌ మొత్తానికీ దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించింది. ఈ టెస్టు సిరీస్‌కి రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. కెప్టెన్సీ విభజన తర్వాత టెస్టుల్లో ఇద్దరినీ చూసే అవకాశం చేజారినా .. కనీసం వన్డేల్లోనైనా కలిసి ఆడతారని అంతా ఊహించారు. కానీ.. వన్డేలకి తాను దూరంగా ఉండబోతున్నట్లు బీసీసీఐకి విరాట్ కోహ్లీ సమాచారం అందించినట్లు వార్తలు వచ్చాయి.

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అవమానకరరీతిలో భారత సెలెక్టర్లు తప్పించగా.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే కోహ్లీ ఇలా వన్డే సిరీస్‌కి దూరంగా ఉండబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. వన్డే కెప్టెన్సీ నుంచి గౌరవంగా తప్పుకోవాలని కోహ్లీకి సూచించిన సెలెక్టర్లు.. రెండు రోజులు గడువు ఇవ్వగా కోహ్లీ స్పందించలేదని.. దాంతో నిర్మొహమాటంగా వేటు వేసినట్లు వార్తలు వచ్చాయి. 2019 వన్డే ప్రపంచకప్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కోల్డ్‌ వార్ నడుస్తుండగా.. ఇప్పుడు మరోసారి చర్చకి వచ్చింది. ఇద్దరూ బ్రేక్ తీసుకోవడంలో తప్పులేదు.. కానీ.. బ్రేక్ తీసుకుంటున్న టైమింగ్ తప్పు అంటూ మహ్మద్ అజహరుద్దీన్ మండిపడ్డాడు. ఐపీఎల్‌ తర్వాత… కేవలం వన్డేలు, టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా కొనసాగుతానని… టీ20 లకు కెప్టెన్‌గా ఉండబోనని గతంలో ప్రకటించాడు విరాట్‌ కోహ్లీ. కోహ్లీ ప్రకటన తర్వాత… టీ20 లకు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మని నియమించింది బీసీసీఐ.

వ్యక్తిగత కారణాలతో సౌతాఫ్రికాతో వన్డే మ్యాచులకు కూడా అందుబాటులో ఉండలేనని కోహ్లీ, గాయం కారణంగా సౌతాఫ్రికా తో జరిగే టెస్టు మ్యాచులకు తాను కూడా దూరంగా ఉంటానని రోహిత్‌ చేసిన ప్రకటనలతో ఇద్దరీ మధ్యా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రోహిత్‌ కెప్టెన్‌గా ఉండే వన్డేలకు కోహ్లీ దూరంగా ఉండటం… కోహ్లీ కెప్టెన్‌గా ఉండే టెస్టులకు రోహిత్‌ దూరంగా ఉండటం.. ఇద్దరి మధ్య వార్‌ ను బహిర్గతం చేశాయి. ఈ విషయంలో.. బీసీసీఐ కూడా ఎలాంటి జోక్యం చేసుకోలేదు.

రోహిత్, కోహ్లీ విభేదాలపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ జోక్యంచేసుకున్నాడు. దేశానికి ఆట ముఖ్యం… వారి మధ్య విభేదాలను తొలగించాలని బీసీసీఐని సూచించాడు.

దీంతో ఈరోజు మీడియా ముందుకు వచ్చిన విరాట్‌ కోహ్లీ… రోహిత్‌ శర్మ తో విభేదాలపై క్లారిటీ ఇచ్చాడు. రోహిత్‌ శర్మ ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమే అని.. రోహిత్‌ సారథ్యంలో ఆడటం తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. కెప్టెన్‌గా లేనంత మాత్రాన తాను ఏమాత్రం నిరుత్సాహ పడను అన్నాడు కోహ్లీ.

అయితే…బీసీసీఐ చైర్మెన్‌ గంగూలీకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు కోహ్లీ. టీ 20 కెప్టెన్‌గా తాను తప్పుకుంటానని నిర్ణయం తీసుకున్నప్పుడు… బీసీసీఐ బాస్‌ గంగూలి కానీ.. బీసీసీఐ సెలెక్టర్లు కానీ… ఎవరు కూడా టీ20 కెప్టెన్‌గా వైదొలగవద్దని, ఎవ్వరు కూడా తనకు చెప్పలేదని కెప్టెన్‌ కోహ్లీ బాంబ్‌ పేల్చాడు.

మరోవైపు గంగూలి మాత్రం… టీ20లతో పాటు టెస్టులు, వన్డేలకు కూడా కెప్టెన్‌గా కోహ్లీనే కొనసాగమని కోరామని, కొన్ని రోజుల కిందట తాను వ్యక్తిగతంగా కోరానని గంగూలి ప్రకటించాడు. గంగూలి కామెంట్స్‌ కి విరుద్దంగా కోహ్లీ ఇవాళ కెప్టెన్సీపై బాంబ్‌ పేల్చడం… ఇండియన్ క్రికెట్‌ టీంలో సంచలనంగా మారింది. ఇన్నాళ్లుగా బీసీసీఐ బాస్‌ గంగూలి, రన్‌ మిషన్‌ కోహ్లీల మధ్య నడుస్తున్న కోల్డ్‌ వార్‌ కాస్తా… కోహ్లీ ప్రెస్‌మీట్‌తో బట్టబయలైంది.

ద్రవిడ్‌ని ఒప్పించి… మెప్పించి… టీం ఇండియా కోచ్‌గా తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన గంగూలి.. అన్నీతాపై నడిపించిన గంగూలి… విరాట్‌ కోహ్లీని బాబోయ్‌ కెప్టెన్సీ వద్దు అనేట్టుగా చేయడంలో కోల్‌కతా ప్రిన్స్‌ గంగూలి సక్సెస్‌ అయ్యాడని.. బీసీసీఐ మాజీ అధికారులు అంటున్నారు.

నిజానికి, గంగూలి బీసీసీఐ బాస్‌ అయిన రోజు నుంచే కెప్టెన్‌ గా కోహ్లీ ని తప్పించడానికే కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయ్యిందనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పుడు దానికి ఆధారంగా జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి.

మరోపక్క కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని సెప్టెంబర్‌లో కోహ్లీ చెప్పాడని, అప్పుడే వద్దని కోహ్లీకి చెప్పామని బీసీసీఐ అంటోంది. ఈ అంశంపై బీసీసీఐ స్పందించలేదని చెప్పడం అవాస్తవమని క్లారిటీ ఇస్తోంది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మరో కెప్టెన్‌ను నియమించాల్సి ఉంటుంది. అప్పుడు వన్డేలకు ఒకరు, టీ-20లకు మరొకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వస్తుంది. అది బీసీసీఐకి సమస్యగా మారుతుందని కోహ్లీతో చెప్పాం వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోమని గంట ముందు చెప్పామన్నది అవాస్తవమని, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటారని గంగూలీ నేరుగా కోహ్లీతో చెప్పారని బీసీసీఐ ప్రకటించింది.