పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేబినెట్‌లో సీనియర్ మంత్రి, టీఎంసీ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీ గురువారం కన్నుమూశారు.. ఆయన వయస్సు 75 ఏళ్లు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ప్రకటించారు.. ఈ ఘటన తర్వాత ఆస్పత్రిని సందర్శించిన సీఎం మమతా బెనర్జీ.. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న సుబ్రతా ముఖర్జీ.. రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని భావించాం.. కానీ, ఈ లోగా గుండెపోటుకు గురయ్యారని.. దీంతో కన్నుమూశారని వెల్లడించారు.. ముఖర్జీ లేకపోవడం పెద్ద నష్టంగా పేర్కొన్నారు.
Read Also: దీపావళి వేళ శుభవార్త.. ఈ రాష్ట్రాలన్నీ పెట్రో ధరలు తగ్గించాయి..
ఇక, మమతా బెనర్జీ కేబినెట్‌లో కీలక మంత్రిగా పనిచేసిన ముఖర్జీ.. పంచాయతీ శాఖతో సహా పలు పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. 26 సంవత్సరాల వయస్సులోనే సిద్ధార్థ శంకర్ రే నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి పిన్న వయస్సుడైన మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు.. 2000 నుండి 2005 వరకు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా కూడా పనిచేశారు.. 1999 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన.. ఆ తర్వాత టీఎంసీలో చేరారు.. ఐదు దశాబ్దాల పాటు సాగిన తన రాజకీయ జీవితంలో ముఖర్జీ.. కోల్‌కతాలోని బల్లిగంజ్ మరియు చౌరింగీతో సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బల్లిగంజ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక, నారద స్టింగ్ వీడియోలలో అతని పేరు తెరపైకి వచ్చింది.. ఈ కేసులో మే 17న సీబీఐ ఆయనను అరెస్ట్ చేయగా.. కొన్ని రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.