దేశంలో చట్టసభల్లో వాతావరణం కలుషితం అవుతోందని, భుజబలం చూపించడం ఎక్కువైందన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. “గాంధీ టోపీ గవర్నర్” పుస్తకావిష్కరణ సభలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
చట్ట సభలు “తాలింఖానాలు” కావని, బుద్ధి బలం చూపించి ఎంతటి శక్తి వంతమైన ప్రభుత్వాలనైనా గడగడలాడించవచ్చన్నారు. ఇటీవల సభ్యులు తమ ప్రవర్తన పై చింతించకుండా సమర్ధించుకోవడం బరితెగింపు అన్నారు వెంకయ్యనాయుడు. ప్రస్తుత పరిస్థితి చూస్తే నాకు నిద్ర పట్టడం లేదు. దేశ భవిష్యత్తు పై ఆందోళన కలుగుతోంది. భుజం బలం చూపడానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. బుధ్ది బలం తో ఎంతటి శక్తివంతులనైనా ఎదుర్కోవచ్చన్నారు.

పార్టీలు బుద్ధి బలం చూపే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమశిక్షణ పాటించాలని కోరితే తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. సభలో మాట్లాడకుండా, బయట మాట్లాడం ఏమిటో అర్దంకావడం లేదు. వారికి మీడియా ప్రాధాన్యత ఇవ్వడం కూడా శోచనీయం. ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజం. చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవడమే పరిణితి. సభకు సభ్యుల హాజరు కూడా తగ్గిపోవడం విచారకరం అన్నారు. సిద్ధాంతం, సేవాభావం, విలువలు కలిగిన వారిని ప్రోత్సహించాలి. విధ్వంసకర ధోరణులు కలిగిన వారిని ప్రోత్సహించవద్దన్నారు.