కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా… తాజా పరిణామాలు చూస్తుంటే.. కేబినెట్ పునర్‌వ్యవస్తీకరణకు సర్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది… ఎల్లుండే భారీ విస్తరణ జరగనున్నట్టు సమాచారం.. నరేంద్ర మోడీ కేబినెట్‌లో 20 మందికి పైగా కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. కేబినెట్ విస్తరణపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులతో సమావేశమై చర్చించారు.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్‌లకు కొత్త మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
ఇక, కొత్తవారిని చేర్చుకోవడమే కాదు.. శాఖల మార్పులు కూడా ఉంటాయని చెబుతున్నారు.. కొందరు పాత మంత్రులకు షాక్‌లు ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న తవర్ చంద్ గెహ్లాట్ ను కర్ణాటక గవర్నర్‌గా నియమించడంతో.. కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు పెరిగిపోయాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేర్లను పరిశీలిస్తే.. జ్యోతిరాదిత్య సింధియా (మధ్య ప్రదేశ్), సర్బానంద సోనోవాల్ (అస్సాం), నారాయణ రాణే
(మహారాష్ట్ర), అనుప్రియా పటేల్ (ఉత్తర్ ప్రదేశ్ ), పంకజ్ చౌధురి (ఉత్తర్ ప్రదేశ్), రీటా బహుగుణ జోషి (ఉత్తరప్రదేశ్), రామశంకర్ కథేరియా (ఉత్తరప్రదేశ్), వరుణ్ గాంధీ (ఉత్తరప్రదేశ్), పశుపతి పారస్ ( బీహార్), ఆర్‌సీపీ సింగ్ ( బీహార్), లల్లన్ సింగ్ ( బీహార్), రాహుల్ కశ్వన్ ( రాజస్థాన్), చంద్ర ప్రకాష్ జోషి (రాజస్థాన్), వైజయంత్ పాండా ( ఒడిశా), కైలశ్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్) తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.. అయితే, తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి అవకాశం ఉండకపోవచ్చు అనే ప్రచారం జరుగుతున్నా.. చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు అంటున్నారు.. ఏపీకి చెందిన సీఎం రమేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా టాక్ నడుస్తుండగా.. తెలంగాణకు చెందిన సోయం బాపురావుకు కూడా అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు.. కానీ, వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.