తిరుమలలో కొండ చరియలు విరిగిపడడం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోలేని భక్తులకు మరో అవకాశం కల్పించింది టీటీడీ. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. భక్తులకు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు. నవంబర్ 18 నుంచి డిసెంబరు 10వ తేది వరకు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా తేదీల్లో దర్శనం టికెట్లు వున్న భక్తులు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు 25 రోజులలో పూర్తి చేస్తాం అన్నారు. రేపటి నుంచి రెండవ ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించి ….లింక్ రోడ్డు ద్వారా మొదటి ఘాట్ రోడ్డులోకి వాహనాలను మళ్ళిస్తాం అన్నారు. అంతకుముందు ఐఐటీ నిపుణుల బృందంతో సమావేశమైన టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి పలు అంశాలు చర్చించారు. టీటీడీ ఛైర్మన్‌తో పాటు అదనపు ఇఓ ధర్మారెడ్డి నిపుణులతో పలు విషయాలు ప్రస్తావించారు.
చిరుత సంచారంతో భయం భయం
మరోవైపు తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ వద్ద చిరుత సంచారం కలవరం కలిగించింది. అడవి పందిని వేటాడుతూ చెక్ పాయింట్ వద్దకు వచ్చింది చిరుత. భయంతో పరుగులు తీశారు భధ్రతా సిబ్బంది. పెట్రోలింగ్ వాహన సైరన్ మ్రోగించడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది చిరుత. దీంతో ఊపిరి పీల్చుకున్నారు భద్రతా సిబ్బంది.