ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదు.. అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… మోడీ వ్యతిరేక శక్తుల సమీకరణ కోసం ఇవాళ రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు.. ఆ సమావేశానికి 14 ప్రతిపక్ష పార్టీలు వచ్చాయని తెలిపారు. నీళ్ల విషయంలో కేంద్రం.. తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తోందని ఆరోపించారు రేవంత్‌రెడ్డి… ఏపీ దాదాగిరి చేస్తుందని కేసీఆర్ అన్నారని.. కానీ, ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏనాడు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది లేదని మండిపడ్డారు.. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుంటే.. టీఆర్ఎస్ ఎంపీలు కలసి రాలేదని మండిపడ్డారు.
ఇక, రాహుల్ గాంధీ సమావేశానికి టీఆర్ఎస్ రాకుండా.. నరేంద్ర మోడీకి స్పష్టమైన మద్దతును కేసీఆర్ ప్రకటించారని విమర్శించారు రేవంత్‌రెడ్డి.. కేసీఆర్, మోడీ వేర్వేరు కాదన్న ఆయన.. బీజేపీ ఫ్రంట్ ఆర్గనైజేషన్‌గా టీఆర్ఎస్ పనిచేస్తోందని ఆరోపించారు. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పలని డిమాండ్ చేశారు రేవంత్.. సీఎం కేసీఆర్ ఒత్తిడితోనే బండి సంజయ్ పాదయాత్ర రద్దు చేసుకున్నారన్న ఆయన.. పార్లమెంట్ ప్రారంభం రోజే జోగినిపల్లి సంతోష్… రాజ్యసభ సభ్యులతో కలసి మోడీని కలిశారని.. ఆ సమావేశాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు ?.. ఆ తర్వాత జోగినిపల్లి సంతోష్.. ప్రధానితో ఏకంతంగా భేటీ అయ్యారని.. మరి మీ అవినీతి చిట్టా ఉందని మోడీ కాళ్ల మీద పడ్డారా ? అని ఎద్దేవా చేశారు రేవంత్‌రెడ్డి.. అయితే, మోడీని కలిసినప్పుడు దిగిన ఫోటోలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలు కృష్ణ, గోదావరి జలాలు, పెండింగ్ నిధులు, కేంద్రం గెజిట్ తో పాటు ఏ అంశాలను ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు రేవంత్.. సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీకి కేసీఆర్ అండగా నిలబడ్డారని ఆరోపించిన ఆయన.. మోడీకి కేసీఆర్ లొంగిపోయారు… దీనితో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.