రాష్ట్రప్రభుత్వం అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించకపోవడం దురదృష్టకరం అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అధికారుల వ్యవహారశైలి కూడా కేసీఆర్ కు అనుగుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధికారులపై తక్షణమే చర్యలు తీసకోవాలి. గత మూడు నెలలుగా తెలంగాణ రైతాంగం వరిధాన్యం అమ్ముకోలేక అవస్థలుపడుతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ శ్రేణులు రైతాంగం సమస్యలపై పోరాటం చేస్తున్నా రాష్ట్రప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మొక్కుబడి ఆందోళన చేస్తున్నారు. ఎంపీలు సేదదీరే పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో టీఆర్ఎస్ ఎంపీలు దీక్ష చేస్తున్నట్లు నటిస్తున్నారు. వారి ప్రవర్తన చాలా చిల్లరగా ఉంది. కేసీఆర్ , ఎంపీల ప్రకటనల వల్ల తెలంగాణ రైతాంగ సమస్యలు పరిష్కారం కాదు. మిల్లర్ల మాఫియాలో బందీ అయిన రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలును కుదించుకుంది. రైతులను మిల్లర్ల మాఫియాకు అప్పగించింది ప్రభుత్వం అని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు. 2018,2019,2020 లలో తెలంగాణ ప్రభుత్వం తనకు ఎఫ్.సి.ఐ ఇచ్చిన టార్గెట్ ను పూర్తిచేయలేదు. ఎఫ్.సి.ఐ సేకరించిన బియ్యం ప్రభుత్వ గోడౌన్ ల నుంచి మాయం అయ్యాయి. దీనికి భాధ్యులు ఎవరు? సిబీఐ విచారణ కు ఎందుకు ఆదేశించడం లేదు. వరంగల్ లో మాయం అయిన 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఘటనపై కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదు.
రేపటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చెయ్యరు. కేసీఆర్ ఆదేశాల మేరకు అందరూ హైదరాబాద్ పయనం అవుతారు. బిజెపి, టీఆర్ఎస్ ల మధ్య ఒప్పందంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనను ముగిస్తున్నారు. తెలంగాణ రైతులు తమ ఎంపీలను నిలదీసి ప్రశ్నించాలి? కేసీఆర్ , నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ లు తమ పదవుల్లో కొనసాగే హక్కు లేదు.
కేంద్రం ఇచ్చిన టార్గెట్ తగ్గిస్తే దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రానున్న రోజులలో తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేస్తాం. టీఆర్ఎస్ ఎంపీలను కోడిగుడ్లు, టమాటాలు, చీపుర్లతో కొట్టి సన్మానించాలి. తెలంగాణలో బియ్యం సేకరణ లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర మంత్రిని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ , బిజెపి ఎంపిలు రెండు తోడు దొంగలే! ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ వేదిక పంచుకోదు. తెలంగాణలో రైతులను హత్యచేసిన పార్టీలు , రైతుల మరణాలకు కారణం అయిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు సంతాపం చెబుతున్నాయి.కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చెయ్యాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.