రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లి లో వడ్డెర బస్తీలో కూల్చిన ఇళ్ళను పరిశీలించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, దివంగత పి.జనార్థన్ రెడ్డిని తలచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి, పేద ప్రజలకు ఆయన చేసిన సేవల్ని స్మరించారు ఆయనే వుండి వుంటే.. పేదల ఇళ్ళను కూల్చే ధైర్యం ఎవరికైనా వుండేదా అని అన్నారు. పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా? పీజేఆర్ లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా తెలంగాణలో పీజేఆర్ లేని లోటు కనిపిస్తోందన్నారు రేవంత్.
క్రిస్మస్ పండగ రోజున పేదల కళ్ళలో నీళ్ళు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బసవతారక నగర్ లో పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయిన వారు ఇప్పుడు ఆ సంగతి మరిచారు. మొన్న బుధవారం తల్లిదండ్రులు పనులకు పోయినప్పుడు.. పిల్లలు బడులకు పోయినప్పుడు వచ్చి ఇక్కడ గుడిసెలు కూల్చారు. ఇక్కడ ఉన్న వడ్డెర సోదరులు తమ కండలు కరగదిస్తేనే ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు వచ్చాయన్నారు రేవంత్.
ప్రభుత్వం కక్ష సాధింపుతో వీరిని అనాథలుగా చేసిందని మండిపడ్డారు. కూల్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీకు అండగా నిలబడ్డారని, కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అన్నారు. 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న వారిని వారు కోరుకుంటున్న విధంగా 60 గజాల భూమి పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టించాలని డిమాండ్ చేశారు.
వీళ్ళకి పట్టాలివ్వకుంటే..పట్టాలు వచ్చే వరకు ఎమ్మెల్యే ఇంట్లోనే వీరందరికీ వంటా వార్పు చేస్తాం అన్నారు. కూల్చిన ఇంటిలోనే ఆడబిడ్డ ప్రసవం జరిగింది..తక్షణమే మున్సిపల్ మంత్రి ఇక్కడికి రావాలన్నారు. స్థానికంగా ఉన్న 250 కుటుంబాలు 1000 మంది బాధ్యత మున్సిపల్ మంత్రి కేటీఆర్ దే అన్నారు రేవంత్ రెడ్డి. తక్షణమే వారు ఇక్కడికి వచ్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వీరికి అండగా ఉంటుంది. అధికారులతో ,మున్సిపల్, జోనల్ కమిషనర్ లతో మాట్లాడానన్నారు. కలెక్టర్, ఆర్డీవోలతో మాట్లాడి పట్టాలు ఇవ్వడానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.