ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి.. తదుపరి కార్యాచరణ విషయమై.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి దాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు, టీఆర్ఎస్ ఎంపీలతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు తెలంగాణ సీఎం.
ధాన్యం కొనుగోళ్ల విషయం పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయంపై స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరిస్థితులు అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. దీంతో తదుపరి కార్యాచరణ ఏంటనే విషయంపై.. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.