ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. తొలిసారి ప్రత్యక్షంగా భేటీ అవుతోంది ప్రస్తుత పాలకమండలి. కౌన్సిల్ మీటింగ్ కోసం బల్దియా ఆఫీస్ లో ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న కౌన్సిల్ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. సమావేశం వాడివేడిగా జరగనుంది.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన భేటీ కానున్న సమావేశంలో కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులుగా నగర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. కరోనా కారణంగా గతంలో వర్చువల్ గా జరిగింది కౌన్సిల్ భేటీ. ఇటీవల కౌన్సిల్ సమావేశం పెట్టాలని బీజేపీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆందోళనలో మేయర్ ఛాంబర్ ధ్వంసం అయింది. బీజేపీ కార్పోరేటర్లపై కేసు నమోదయింది.
వ్యూహా, ప్రతివ్యూహాలతో సిద్ధమైన టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు తలమునకలయి వున్నారు. ప్రశ్నోత్తరాల్లో 23 ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసమస్యలపై టీఆర్ఎస్ ను నిలదీస్తామంటోంది బీజేపీ. గ్రేటర్ అభివృద్ధిని కౌన్సిల్ భేటీలో చెప్తామంటోంది టీఆర్ఎస్. గ్రేటర్ కౌన్సిల్ సమావేశానికి 200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.