చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… ఇప్పటికే భారత్‌లో ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోవడమే కాదు.. ఆర్థికంగా కూడా అన్ని రంగాలను దెబ్బ కొట్టింది ఈ మహమ్మారి.. మరోవైపు… సౌతాఫ్రికాలో తాజాగా వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది.. డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే.. ఒమిక్రాన్ రూపంలో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది.. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పటకే 57 దేశాలను చుట్టేసింది.. భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి దేశంలో దడ పుట్టిస్తోంది. సెకండ్ వేవ్ మిగిల్చిన నష్టాన్ని మర్చిపోకముందే.. ఇక, థర్డ్ వేవ్ ముప్పు తప్పదన్న హెచ్చిరకలు ఇప్పుడు కలవరానికి గురిచేస్తున్నాయి.
Read Also: కుప్పంలో అలా ఎందుకు జరిగింది..? చంద్రబాబు పోస్టుమార్టం
భారత్‌లో థర్డ్‌వేవ్‌పై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. జనవరిలో థర్డ్‌వేవ్ ప్రారంభం అవుతుందని.. అది ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు అని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ తెలిపారు.. ఇక థర్డ్‌వేవ్‌లో రోజుకు 1 లక్షల నుంచి 1.5 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఓ కార్యక్రమంలో కోవిడ్‌పై మాట్లాడిన ఆయన.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ఫిబ్రవరి నాటికి దేశంలో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. జనవరి నుంచే థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందని హెచ్చరించారు. ఇది, సెకండ్ వేవ్ కంటే కాస్త తక్కువగానే ఉంటుంది. ఒమిక్రాన్ యొక్క తీవ్రత డెల్టా వేరియంట్‌లో కనిపించే దానిలా లేదన్నారు.. ఇక, సౌతాఫ్రికాలో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కావడంలేదని తెలిపారు మనీంద్ర అగర్వాల్.. ఇది సంతోషించాల్సిన విషయమని పేర్కొన్న ఆయన.. ఒమిక్రాన్ అధిక ట్రాన్స్‌మిసిబిలిటీని చూపించినప్పటికీ.. దాని తీవ్రత డెల్టా వేరియంట్ కంటే తక్కువగానే ఉంటుందని అంచనావేశారు. మరోవైపు కట్టడి చర్యలపై స్పందిస్తూ.. ఒమిక్రాన్ నివారణకు లాక్‌డౌన్ అవసరం లేదు.. రాత్రి కర్ఫ్యూ లాంటివి సరిపోతాయని అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా నిబంధనలు అంతా పాటించాలని.. అప్పుడే ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోగలమని విజ్ఞప్తి చేశారు ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్.