NTV Telugu Site icon

యువతిని మోసం చేసిన ఉగాండా ఉన్మాది.. రఫ్ఫాడించిన పోలీసులు

ఓ యువతిని మోసం చేసిన ఉగాండా వ్యక్తిని పోలీసులు సినీఫక్కీలో అరెస్టు చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన ఓ యువతికి ఉగాండాకు చెందిన “నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్” అనే వ్యక్తి ఫోన్‌ చేసి ఆన్‌లైన్‌ లాటరీలో రూ2.5 కోట్ల వచ్చాయని నమ్మించాడు. ఈ నేపథ్యంలో లాటరీ డబ్బులు రావాలంటే ట్యాక్స్‌లు కట్టాలంటూ సదరు యువతి నుంచి మొదట రూ.3.5 వేలు, తర్వాత రూ.12.5 వేలు ఇలా దశలవారీగా రూ.13,78,890 లను వసూలు చేశాడు.

Also Read : దేశాలను చుట్టేస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌..

అయితే బంగారం, ఇల్లు, పొలం కుదువబెట్టి డబ్బు సమకూర్చిన యువతి ఆ తరువాత తాను మోసపోయినట్లు గ్రహించి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నగరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో విచారణ బృందాన్ని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ఏర్పాటు చేశారు. అయితే నగిరి ఇన్‌స్పెక్టర్‌ మద్దయ్యచారి ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసుల సహకారంతో నిందితుడి నివాసం పై పోలీసులు దాడి చేశారు.

పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్లగా… ఇంటిగేటు తీయకపోవడంతో సినీఫక్కీలో ఇంటిగేటును గ్యాస్ కట్టర్ లతో తొలగించి మరీ అరెస్ట్ చేసినట్లు చిత్తూరు పోలీసులు వెల్లడించారు. విచారణ కోసం ఢిల్లీ నుండి ట్రాన్సిట్ వారెంట్ పై చిత్తూరుకు నిందితుడు జాన్‌ను తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.