దక్షిణాఫ్రికాలో గత నెల వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోని పలు రాష్ట్రాల్లో వ్యాపించింది. అయితే తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదవడంతో స్థానికంగా కలకలం రేగింది. ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాలో ఉంటూ ఇటీవలే ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్దారణైంది. విదేశాలలో చేయించుకున్న పరీక్షల్లో నెగిటివ్ రాగా, ఒంగోలులో మరోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో ఆ వ్యక్తి శ్యాంపిల్స్‌ను హైదరాబాద్ సీసీఎంబీ ల్యాబ్ లో పరీక్షలు చేయగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలింది. అయితే ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు లేకుండా బాధితుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. బాధితుడి కుటుంబాన్ని వైద్యాధికారులు రిమ్స్ కు తరలించి పరీక్షలు చేసే ఆలోచనలో ఉన్నారు. అధికార యంత్రాంగం బాధితుడు ఎవరెవరిని కలిసాడో తెలుసుకునే పనిలో పడ్డారు.