ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నూతన గ్రామ కమిటీలను, మండల కమిటీలను టీఆర్‌ఎస్ నియమించింది. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 9వ సారి కూడా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం కూడా హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. వచ్చే నెలలో వరంగల్‌లో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానంటూ.. గతంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు కూడా.
అయితే ఇటీవల ఎన్నుకున్న గ్రామ కమిటీలు, మండల కమిటీలలో పదవి ఆశించి భంగపడ్డ నేతలు అసంతప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ కు లీడర్ కు మధ్య సంత్సబంధాలు ఉండేలా చేసేందుకు భారీ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా రానున్న 2023-24 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే రంగం సిద్దం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామ కమిటీలు టీఆర్‌ఎస్ పార్టీకి పునాదులు అంటూ కేసీఆర్ పలు మార్లు ప్రసంగించారు.
అయితే ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజల్లో విముఖత ఉందని నివేదకలు రావడంతో.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు పావులు కదుపుతున్నారా..? అనే ప్రశ్న పలువురు రాజకీయ నేతల మనుసులో ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో అంపశయ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. కార్యకర్తలు కూడా నూతనోత్సాహంతో రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న సభలకు, సమావేశాలకు హజరవుతున్నారు.
రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైననాటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తూ.. తన నియామకంపై విముఖతతో ఉన్న వారిని మచ్చిక చేసుకుంటున్నారు. రేవంత్ నియామకంతో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి అసంతృప్తితో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలు కూడా తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరైతే ఇప్పటికే చేరిపోయారు. దీనితో పాటు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం కావడంతో బీజేపీ కార్యక్రమాల్లో మార్పు వచ్చింది.
బండి సంజయ్ నియామకమైన తరువాత రాష్ట్రంలో బీజీపీ పుంజుకుంది అనే వాదనకు ఇటీవల జీహెచ్‌ఎంసీ ఫలితాలే సాక్ష్యం. దీంతో మళ్లీ ప్రతిపక్షం పుంజుకోకుండా ఉండేందుకు కార్యకర్తల్లో నమ్మకం నింపేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారా..? అని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా రాజకీయంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ కు మాంచి గ్రిప్ ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రానున్న ఎన్నికల్లో గెలుపే సంకల్పంగా టీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోందా..? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.