కల్యాణం కమనీయం అంటారు. కానీ మనదేశంలో పెళ్ళిళ్ళు చాలా కాస్ట్లీ అయిపోయాయి. మూడు ముళ్ళు, ఏడడుగులు వేయాలంటే భారీగా ఖర్చుపెట్టాల్సిందేనా? లక్షల కోట్లు ఆవిరి కావాల్సిందేనా? అంటే అవునంటున్నారు వ్యాపారులు. మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల వివాహాలు వాయిదా పడ్డాయి కానీ లేకుంటే అంగరంగ వైభవంగా పెళ్ళితంతు జరగాల్సిందే. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కరోనా కారణంగా వాయిదా పడ్డ వివాహాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి.
ఈ ఏడాది 14 నవంబర్ నుంచి 13 డిసెంబర్ మధ్యకాలంలో మంచి ముహూర్తాలు వున్నాయి. దీంతో వివాహాలు భారీగా జరగనున్నాయని తెలుస్తోంది. దాదాపుగా 25 లక్షల వివాహాలు ఈ శుభముహూర్తాన జరగనున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అధ్యయనంతో తేలింది. అంటే ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెడతారో అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్ళి తంతు ఖర్చు తక్కువేం కాదు. అక్షరాలా 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
కేవలం దేశరాజధాని ఢిల్లీలోనే 1.5 లక్షల పెళ్ళిళ్ళకు భాజాభజంత్రలు మోగనున్నాయి. ఇందుకోసం 50వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. కరోనా కారణంగా లక్షలాది పెళ్ళిళ్ళు గత ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వచ్చాయి. పెళ్ళిళ్ళకు అతిథుల రాకపై తీవ్రమయిన ఆంక్షలు అమలయ్యాయి. 10 నుంచి 20 మందికి మాత్రమే అనుమతి లభించేది.
దీంతో పెద్ద కుటుంబాల వారు అంత సింపుల్‌గా పెళ్ళిళ్ళు చేయలేక వాయిదా వేశారు. ఈ నెల నుంచి డిసెంబర్ వరకూ జరిగే పెళ్ళిళ్ళతో కల్యాణ మంటపాలు, హోటళ్ళు, ఓపెన్ లాన్స్, బ్యాంకెట్ హాల్స్, ఫాంహౌస్‌లు సందడిగా మారనున్నాయి. పెళ్ళిళ్ళపై ఆధారపడ్డ అనేక సంస్థలు, క్యాటరింగ్ సంస్థలకు వ్యాపారం రానుంది. అనేక రాష్ట్రాలు 250 మంది వరకూ పెళ్ళిళ్ళకు అనుమతి ఇస్తున్నాయి.
ఢిల్లీలో 200 మంది అతిథులకు ప్రభుత్వం అనుమతిస్తోంది. ముంబై, ఎన్‌సీఆర్, రాజస్థాన్ ప్రాంతాల్లో వివిధ ఫంక్షన్ హాళ్ళలో 50 శాతం కెపాసిటీ, 200మంది వరకూ అతిథుల్ని అనుమతిస్తున్నాయి. ఆతిథ్య సంస్థలు భారీ వివాహాలతో వేల కోట్ల టర్నోవర్ సాధించనున్నాయి. ఈ పెళ్ళిళ్ళ కారణంగా క్యాటరింగ్ సంస్థల పంట పండనుంది. అసలే పెళ్ళి అంటే ఆ తంతు, ఆ ఆర్భాటం, హంగామా మామూలుగా వుండదు.