ఓటు అనేది ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటింది. ఓటర్లు దీనిని ఎలా వాడుకుంటే అదే రిజల్ట్ వస్తుంది. ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్ బంగారుమయంగా ఉంటుంది. అలాకాకుండా ఓటును నోటుకో, మద్యానికో అమ్ముకుంటే కష్టాలుపడక తప్పదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా రాజకీయాలు భ్రష్టుపట్టిపోవడంతో శాసనసభ, పార్లమెంట్ ఉభయ సభల్లోకి క్రిమినల్ రికార్డులున్న వాళ్లే ఎక్కువగా అడుగు పెడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి పెనుముప్పును తెచ్చే పెట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం నూటికి తొంభై శాతం మంది ఏదో ఒక ప్రయోజనం కోసం రాజకీయాల్లోకి కొనసాగుతున్నారు. కేవలం 10శాతం మాత్రమే ప్రజాసేవ చేసేందుకు వస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఇప్పుడంతా ఓటుకు నోటు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే ఎన్నికల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిలో దొంగ ఓట్లు వేయడం కూడా కన్పిస్తూ ఉంటుంది. ఎవరైనా తమ ఓటును దొంగ ఓట్ల కారణంగా వినియోగించుకోనే అవకాశం కోల్పోతే ఈ పద్ధతి ద్వారా తిరిగి తమ ఓటు హక్కును పొందే అవకాశం లభించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 30న రెండు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెల్సిందే. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో, ఏపీలోని కడప జిల్లా బద్వేల్ లో ఈనెల 30న పోలింగ్ నిర్వహించేలా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీలో ఉప ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశం ఉండగా.. తెలంగాణలో మాత్రం పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే ఓటర్లు ఛాలెంజింగ్ ఓటు గురించి తెలుసుకుంటే మీ ఓటును పకడ్బంధీగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉండనుంది.
ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు పోలవడం ఎక్కడో ఒకచోట కామన్ అయిపోయింది. మన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడ ముందుగానే మన ఓటును ఎవరో ఒకరువేసి వెళ్లడం కన్పిస్తుంది. దీంతో చేసేదేమీలేక ఓటర్లు వెనుతిరుగుతూ ఉంటారు. దీనికి చెక్ పెట్టేలా కండాక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని సెక్షన్ 49పీ ఓటుహక్కుకు రక్షణ కల్పిస్తోంది. ఈ సెక్షన్ ప్రకారంగా ఎవరైనా మన ఓటువేసి వెళ్లినప్పుడు ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులకు కోరే అవకాశం ఉంటుంది.
అనంతరం మనం ఛాలెంజ్ ఓటును నమోదు చేయాలని ప్రిసైడింగ్ అధికారిని కోరచ్చు. రూ.5 చెల్లించి మన ఓటును నమోదు చేయాలని ప్రిసైడింగ్ అధికారిని కోరితే ఆయన మన గుర్తింపు కార్డును పరిశీలించి ఓటును నమోదు చేస్తారు. ఈ ఓటును ప్రత్యేకమైనదిగా గుర్తించి అవసరాన్ని బట్టి ఈ ఓటును లెక్కిస్తారు. తద్వారా మన ఓటు పక్కదారి పట్టినా కూడా ఛాలెంజింగ్ ఓటు ద్వారా మనం కోరుకున్న అభ్యర్థికి వేసే అవకాశం లభిస్తుంది. ఇది ఒక్కోసారి గెలుపొటములను డిసైడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.