కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నాగులచవితి కూడా కావడంతో మహిళలు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరం భక్త జనో సందోహంతో నిండిపోయింది.
తెల్లవారుజామున మూడు గంటల నుండి గోదావరి నది తీరాన భక్తులు స్నానం ఆచరించి శివాలయాలకు క్యూ కడుతున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు హర హర మహాదేవ శంభో శంకర అంటూ మారుమోగుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం,నాగుల చవితి కలిసి రావడంతో ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యంగా పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీ భీమేశ్వరాలయం భక్తులతో పోటెత్తాయి.