తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది అభ్యర్థులు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క స్థానానికి ఏడుగురు అభ్యర్థులు, ఆదిలాబాద్‌లో ఒక్క స్థానానికి ఇద్దరు, ఖమ్మంలో ఒక్క స్థానానికి నలుగురు, మెదక్ జిల్లాలో ఒక్క స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Read Also: సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేవారు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించి తమ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి శశాంక్ సూచించారు. పోలింగ్ సిబ్బంది, ఓటర్లు తప్పకుండా గ్లౌస్, మాస్కులు ధరించి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. ఎవరైనా ఓటర్లకు కరోనా పాజిటివ్ వస్తే.. అలాంటి వారికి చివరి గంటలో ఓటు హక్కును వినియోగించుకునేలా అనుమతి ఇస్తామని శశాంక్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 పోలింగ్ స్టేషన్‌లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 పోలింగ్ స్టేషన్‌లు, ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 పోలింగ్ స్టేషన్‌లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 పోలింగ్ స్టేషన్‌లు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు జరిగే ఆయా జిల్లాల్లో పోలింగ్ ముగిసేవరకు మద్యం అమ్మకాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.