కరోనా మహమ్మారి వల్ల సామాన్యులతో పాటు ఎందరో రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారం రోజుల పాటు రైతుల సమస్యలపై ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి.. శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
దీంతో మంత్రి ఎర్రబెల్లి ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలెవ్వరూ తన వద్దకు రావద్దని కోరారు. తన నియోజకవర్గ ప్రజలకు అధికారులు, పీఏలు అందుబాటులో ఉంటారని సూచించారు. ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి వైద్యులను సంప్రదించి తగు మందులు తీసుకుంటూ క్షేమంగా ఉన్నారు.
కాగా ఢిల్లీ పర్యటనకు మంత్రి ఎర్రబెల్లితో పాటు.. మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సహా టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకే, ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనార్థమై, వారు పండించిన ధాన్యం, బియ్యం కేంద్రం కొనుగోలు చేయడంపై రాతపూర్వక హామీ కోసం గత నాలుగు, ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసిన నేపథ్యంలో తనకు కరోనా వచ్చిందని మంత్రి అన్నారు. ఇప్పటికైనా కేంద్రం రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎర్రబెల్లి కోరారు.
Read Also: సినిమాలో నటిస్తున్న విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే