అక్కడ వారిదే పెత్తనం. అధికారులు సైతం వారి మాటను జవదాటరట. చివరకు స్వపక్షం.. వైరిపక్షాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఇవ్వాలన్నా వారే చెప్పాలట. ప్రస్తుతం ఆ అంశమే నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఇంతకీ ఎవరు వాళ్లు? ఏంటా నియోజకవర్గం? లెట్స్ వాచ్!
ఎమ్మెల్యే చెప్పిన వారికే ప్రొటోకాల్?
నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే బాస్‌లు. ప్రభుత్వ పెద్దలు దీనిపై ఎప్పుడో స్పష్టత ఇచ్చారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మాత్రం ఆ అంశానికి మరింత విస్తృతార్థం తీశారట అక్కడి నేతలు. అన్ని అంశాలలోనూ వారు బాసిజం ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో చీమ చిటుక్కుమన్నా.. తమకు తెలియాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు రాఘవ ఆదేశించారట. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా.. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్‌కు వచ్చేసరికి రచ్చ రచ్చ అవుతోందట. ఆ అంశం ఆధారంగా కొత్తగూడెం రాజకీయాలు వాడీవేడీగా మారుతున్నాయి.
వేదికపైన స్థానిక ప్రజాప్రతినిధులకు చోటు లేదా?
ప్రొటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్‌కు జడ్పీటీసీ వసంత ఫిర్యాదు!
ఎమ్మెల్యే లేదా మంత్రులు వచ్చే కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను వేదికపైకి పిలవడం లేదట. కొన్ని సందర్భాలలో ఆహ్వానాలు కూడా ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు కాని లీడర్లు వేదిక అలంకరిస్తున్నారట. ఇటీవల జరిగిన హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అదే జరిగినట్టు స్థానిక ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక జడ్పీటీసీ వసంతను పిలవలేదట. ఎమ్మెల్యే వనమాకు ఆమెకు మధ్య పడటం లేదు. జలగం వర్గం కావడంవల్లే జడ్పీటీసీని ఎమ్మెల్యే వనమా.. ఆయన కుమారుడు రాఘవ పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. ప్రొటోకాల్ ఉల్లంఘనపై వసంత జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది.
మున్సిపల్ ఛైర్‌పర్స్‌నూ పట్టించుకోవడం లేదని ప్రచారం
2018 ఎన్నికల్లో వనమా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొన్నాళ్లకే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు వనమా. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతిచ్చింది. కానీ.. కండువా మార్చిన తర్వాత సీపీఐతోనూ ఎమ్మెల్యేకు పడటం లేదట. సీపీఐ ఎంపీటీసీలకు కూడా ఎమ్మెల్యే ప్రొటోకాల్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. వీరి సంగతి అలా ఉంటే.. సొంతపార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాపు సీతామహాలక్ష్మిని సైతం వనమా శిబిరం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు పెడితే అందులో వనమా.. ఆయన కుమారుడు ఫొటోలే ఉంటున్నాయట. మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఫొటో కనిపించదని ఓపెన్ టాక్. పోనీ.. ఆమె ఏమైనా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గమా అంటే అదీకాదు. ఏరికోరి ఆయనే మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ను ఎంపిక చేశారు.
నిలదీసినా ఎమ్మెల్యే తనయుడు సమాధానం చెప్పలేదట
ప్రొటోకాల్ దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్న ఛైర్‌పర్సన్ సీతామహాలక్ష్మి ఓ సందర్భంలో రాఘవను నిలదీశారట. తర్వాత మాట్లాదాం అని ఆయన వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. జరిగిన దానికి నోచ్చుకున్నారో ఏమో ఆ ఘటన తర్వాత ఛైర్‌పర్సన్ సైలెంట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కొత్తగూడెంలో ప్రొటోకాల్ రగడ స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.