Site icon NTV Telugu

హుజురాబాద్‌ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్టేనా..?

హుజురాబాద్‌లో ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేనా? ఆలస్యమయ్యే కొద్దీ ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం? జరుగుతున్న పరిణామాలు ఎవరి కొంప ముంచుతాయి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్‌ వాచ్‌!

హుజురాబాద్‌పై మూడు ప్రధాన పార్టీల ఫోకస్‌!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌కు ఉపఎన్నిక షెడ్యూల్‌ ఇంకా రాలేదు. కానీ.. రాజకీయాన్ని రంజుగా మార్చాయి పార్టీలు. గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది టీఆర్ఎస్‌. ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే అక్కడ అధికారపార్టీ దూకుడుగా వెళ్తోంది. దళితబంధు పథకానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. అధికారికంగా ప్రకటించకపోయినా.. బీజేపీ నుంచి బరిలో దిగే ఈటల రాజేందర్‌ సైతం హుజురాబాద్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కొద్దిరోజులు పాదయాత్ర చేశారు. ఇలా రెండు పార్టీలు పోటాపోటీగా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి పేరు బలంగా వినిపిస్తోంది. ఆ విధంగా మూడు పార్టీల ఫోకస్‌ పెరిగింది.

ఈ నెలాఖరు తర్వాతే ఉపఎన్నిక షెడ్యూల్‌?

ప్రధాన పార్టీల తీరు అలా ఉంటే.. ఇప్పట్లో హుజురాబాద్‌ ఉపఎన్నిక జరుగుతుందా? మరికొంతకాలం వాయిదా పడుతుందో క్లారిటీ లేదు. ఈ నెలలోనే నోటిఫికేషన్‌ వస్తుందని అనుకున్నా.. కరోనా టైమ్‌లో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం కోరిన కేంద్ర ఎన్నికల సంఘం..ఈ నెలాఖరు వరకు టైమ్‌ ఇచ్చింది. అంటే ఈ నెలాఖరు వరకు నోటిఫికేషన్‌ రాదన్నది రాజకీయవర్గాల అనుమానం.

వాయిదా పడితే.. ఇప్పుడున్న టెంపో కొనసాగించడం కష్టమేనా?

ఇంతటి వేడి నెలకొన్న హుజురాబాద్‌లో ఉపఎన్నిక ఇప్పట్లో జరక్కపోతే.. పరిస్థితి ఏంటి? వాయిదా పడటంవల్ల ఏ పార్టీకి లాభం? మరేపార్టీకి నష్టం? కరోనాతో ఎన్నిక వాయిదా వేయాలని EC చూస్తే ఎన్నాళ్లు పోస్ట్‌పోన్‌ చేస్తుంది? అప్పటి వరకు ఎన్నికల హీట్‌ను పార్టీలు కొనసాగిస్తాయా? ఇదే జరిగితే.. ఎన్నిక తేదీ ప్రకటించేవరకు ఈ టెంపోను కొనసాగించడం ఖర్చుతో కూడుకున్నది. కాకపోతే అధికారపక్షానికి మాత్రం మరింత వెసులుబాటు చిక్కుతుంది. ఇప్పటికే వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించింది. పరిస్థితిని అనుకూలంగా మల్చుకోవడానికి టీఆర్ఎస్‌కు ఛాన్స్ ఉంటుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాష్ట్రంలో చేపట్టలేదు. కోవిడ్‌ ప్రమాదం పొంచే ఉందని ఈసీకి తెలియజేసింది ప్రభుత్వం. ఇది గమనించే బీజేపీ నేతలు త్వరగా హుజురాబాద్‌ ఉపఎన్నిక పెట్టాలని కేంద్ర నాయకత్వాన్ని కోరగా.. ఢిల్లీ నాయకులు వేరే లెక్కల్లో ఉన్నట్టు సమాచారం.

కేడర్‌ను కాపాడుకోవడం ఈటలకు సవాలేనా?

ఎన్నిక వాయిదా పడితే విపక్ష పార్టీలకు ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. తన వర్గాన్ని కాపాడుకోవడం.. అనుచరులు చెదిరిపోకుండా చూసుకోవడం ఈటలకు సవాలే. ఇప్పుడున్న కష్టాలు రెట్టింపయ్యే వీలుంది. తనపై ఉన్న సానుభూతిని పోకుండా చూసుకోవడం కూడా ఈటలకు రిస్కే. ఇక కాంగ్రెస్‌ కేడర్‌ అప్పటి వరకు నిలిచి ఉంటుందా అన్నది అనుమానమే. అందుకే హుజురాబాద్‌ ఉపఎన్నిక కంటే.. వాయిదా పడటం వల్ల కలిగే లాభనష్టాలపై చర్చ ఎక్కువ జరుగుతోంది. మరి.. హుజురాబాద్‌ బైఎలక్షన్‌ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూడాలి.

Exit mobile version