ఏపీ దేవదాయ శాఖలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టే కార్యక్రమాల అమలులో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారట. సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ అంశాలు ఆ కోవలోకే వస్తున్నాయట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
దేవాదాయశాఖ ఉన్నతాధికారులు తీవ్ర అలక్ష్యం!
ఇటీవల ఏపీలో రాజకీయమంతా దేవాదాయశాఖ చుట్టూనే నడుస్తోంది. ఉత్తరాంధ్రలో సింహాచలం భూములు, మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మాన్సాస్‌లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. నిగ్గు తేల్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే అక్రమాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు తీవ్ర అలక్ష్యం చేస్తున్నారట. దానిపైనే అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.
సరెండర్ ఉత్తర్వులపై స్పెషల్ కమిషనర్ సంతకం చేయొచ్చా?
చిన్న చిన్న అంశాలను పట్టించుకోకపోవడం వల్లే ఇబ్బందులు!
టీడీపీ హయాంలో సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో అక్రమాలు జరిగినప్పుడు ఈ రెండు సంస్థలకు ఈవోగా రామచంద్రమోహన్ ఉన్నారు. ఆయన్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఆ ఉత్తర్వులపై స్పెషల్ కమిషనర్ అర్జునరావు సంతకం చేయడమే దేవాదాయ శాఖలో చర్చగా మారింది. అడిషనల్ కమిషనర్ హోదాలో ఉన్న రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసే అధికారం స్పెషల్ కమిషనరుకు లేదనే వాదన వినిపిస్తోంది. దేవాదాయ శాఖకు ఆయన కమిషనర్‌గా ఉంటే ఆ హోదాలో ఉత్తర్వులు జారీ చేయవచ్చని.. కానీ అర్జునరావు స్పెషల్ కమిషనర్ మాత్రమేనని కామెంట్స్ చేస్తున్నారు. కమిషనర్ లేని సమయంలో దేవాదాయ శాఖ సెక్రటరీకి సరెండర్ ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉంటుందట. ఇలాంటి చిన్న చిన్న అంశాలను కూడా పట్టించుకోకపోవడం వల్ల న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే సందర్భంలో అన్నిరకాలుగా ఆలోచన చేసి ఉత్తర్వులు జారీచేస్తే భవిష్యత్‌లో ప్రభుత్వానికి తలనొప్పులు తప్పుతాయి కదా అనే చర్చ జరుగుతోంది.
ఆ అధికారి ఇచ్చే నివేదికలో నిజాలు బయటపడతాయా?
సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ భూముల అక్రమాలను వెలికి తీయడానికి విచారణ అధికారిగా విశాఖ అసిస్టెంట్ కమిషనర్ పుష్పవర్దన్‌ను నియమించారు. సింహాచలం ఈవోగా రామచంద్రమోహన్ ఉన్నప్పుడే సదరు పుష్పవర్దన్ విశాఖలో ACగా ఉన్నారట. అక్రమాలు జరిగినప్పుడు ఏ అధికారైతే ఉన్నారో.. అదే అధికారిని విచారణాధికారిగా నియమించడాన్ని కూడా దేవాదాయశాఖలో విస్తృతంగా చర్చించుకున్నారు. ఒకవేళ రామచంద్రమోహన్ నిజంగానే అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో తేలితే అప్పట్లో అతని పైఅధికారిగా పుష్పవర్దన్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుందేమో..! అదే జరిగితే పుష్పవర్దన్ నివేదికలో నిజాలు బయట పడతాయా? ఈ లాజిక్ మరిచిన ఉన్నతాధికారులు.. వేశాం అంటే వేశాం అన్నట్టు విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఇదెక్కడి చోద్యం అంటూ నోళ్లెళ్లబెట్టారట. అయితే దీనిని సరిదిద్దుకునే క్రమంలో అదే అంశంపై దేవాదాయ శాఖ అడిషనల్ కమిషన్ చంద్రకుమార్‌ను కూడా మరో విచారణాధికారిగా నియమించారట. ఈ నిర్ణయం ఏదో ముందే తీసుకుంటే విమర్శలు వచ్చేవి కాదు కదా అనే చర్చ జరుగుతోంది.
ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేదా?
కీలక నిర్ణయాల అమలులో లోపాలు అందుకేనా?
మాన్సాస్, సింహాచలం భూముల విషయంలోనే కాకుండా.. ఇతరాత్ర అంశాల్లో కూడా దేవాదాయ శాఖ కమిషనరేట్లో ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో నానా తిప్పలు పడాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆలయాల్లో చిన్నచిన్న పనుల విషయంలోనూ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారట. ఫలితంగా ఆయా గుళ్లల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తడంతోపాటు.. లేనిపోని వివాదాలు ఎదురవుతున్నట్టు సమాచారం. దుర్గగుడి శానిటేషన్ టెండర్లలో తీవ్ర జాప్యం జరిగి.. మళ్లీ మొదటికి వచ్చిన పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కమిషనరేట్లో విధులు నిర్వహించే ఏ ఒక్క అధికారి మధ్య సత్సంబంధాలు లేవట. అందుకే దేవాదాయ శాఖ పరిధిలో ప్రభుత్వం తీసుకునే కొన్ని కీలక నిర్ణయాల అమలులో లోపాలు కన్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మరి.. ప్రభుత్వ పెద్దలు ఈ సమస్యలను ఎలా అధిగమిస్తారో చూడాలి.