పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసిన కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. మృతురాలు భర్త సూరజ్‌కు రెండు జీవిత ఖైదులను విధించింది.. తన భార్యను హత్య చేసిన కేసులో భర్త సూరజ్‌ను గత సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సందర్భంగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు.. ఈ నేరానికి దోషికి మరణశిక్ష విధించాలి.. కానీ, అతడి ఏజ్‌ను దృష్టిలో ఉంచుకుని జీవితఖైదు విధిస్తున్నాం అని తెలిపారు.. అంతేకాదు.. సాక్ష్యాలను నాశనం చేసినందుకు మరో ఐదేళ్లు, గతంలో ఒకసారి హత్యాయత్నం చేసినందుకు 10 ఏళ్లు జైలుశిక్ష విధించారు.. అంటే.. ఈ 17ఏళ్ల జైలుశిక్ష పూర్తయిన తర్వాతే రెండు జీవిత ఖైదుల శిక్ష మొదలవుతుందని కోర్టు స్పష్టం చేసింది.. మరోవైపు.. శిక్షలతో పాటు రూ.5.85లక్షల జరిమానా కూడా విధించింది.
కాగా, గత ఏడాది కేరళలోని కొల్లంలో 27 ఏళ్ల వివాహిత ఉత్తర పాముపాటుతో ప్రాణాలు కోల్పోయింది.. నిద్రలో ఉన్న ఆమెను రెండుసార్లు పాము కాటు వేయడం ద్వారానే చనిపోయినట్టు భర్త సూరజ్ కుమార్ చెప్పాడు.. ఇదిగో ఈ పామే ఆమెను కాటు వేసిందంటూ ఓ చచ్చిన పామును చూయించాడు. దీంతో అతడు చెప్పింది నిజం అని అంతా నమ్మారు.. అయితే, మృతురాలి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. పోస్టుమార్టం జరిపించారు పోలీసులు. ఇక, ఉత్తర మరణించిన మూడు రోజుల తర్వాత ఆమె తండ్రి పోలీసులను కలిశాడు.. తమ కుమార్తె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ఉత్తరను ఓ పాము కాటు వేసిందని.. ఆమె చికిత్స పొందుతుండగా.. మళ్లీ పాము కాటువేయడంతోనే చనిపోయిందని వివరించారు. ముఖ్యంగా అల్లుడి వ్యవహార శైలిపై సందేహాలు వ్యక్తం చేశాడు. దీంతో.. సూరజ్‌పై నిఘా పెట్టారు కొల్లం పోలీసులు.. సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలించడంతో పాటు ఇంటర్‌నెట్‌లో అతడు దేనికోసం వెతికాడు అనే వివరాలను కూడా సేకరించారు.. అయితే, ఉత్తరను తొలిసారి సూరజ్ ఇంట్లోనే పాము కాటువేసింది.. అది కూడా రక్త ఫింజర.. ఇక, రెండోసారి అత్తగారింట్లో నాగుపాము కాటువేసింది.. తొలిసారి ఆమెను పాము కాటువేసినప్పుడు ఆమె రెండో అంతస్తులో నేలపై నిద్రిస్తోంది.. కానీ, రక్త పింజర చాలా అరుదుగా చెట్లు ఎక్కుతుంది.. అయితే, సూరజ్ ఇంటి బాల్కనీకి ఆనుకొని ఓ చెట్టు కొమ్మ ఉంది.. పాము దానిపై నుంచే ఇంట్లోకి ప్రవేశించిందని సూరజ్ తల్లి పోలీసులకు చెప్పింది.
రెండోసారి ఉత్తరను నాగుపాము కాటువేసింది.. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాటువేసింది.. అయితే, ఆమె ఉన్న గదిలోకి కిటికీ ద్వారా పాటు ప్రవేశించలేదని.. ఎవరైనా పామును గదిలోకి తీసుకొచ్చిఉంటారని నిర్ధారించారు పోలీసుల.. ఇక, ఉత్తరను తొలిసారి పాము కాటువేయడానికి ముందు.. రక్త పింజరల కోసం నెట్‌లో అన్వేషించినట్టుగా పోలీసులు గుర్తించారు.. ఆ తర్వాత అతడి దృష్టి పూర్తిగా నాగుపాములవైపు మళ్లింది.. ఉత్తరను నాగుపాము కాటువేసి.. ఆమె చనిపోయిన తర్వాత అతడి అన్వేషణ పూర్తిగా ఆగిపోయింది.. దీంతో సూరజ్ పక్కా ప్లాన్‌తో ఉత్తరను చంపినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇక, ఈ కేసులో సాంకేతిక సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. ఈ కేసులో మొత్తం 87 మంది సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టారు.. అలాగే విచారణ సమయంలో 40 రకాల సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. 24 డ్యాక్యుమెంట్లతో పాటు మూడు సీడీలతో సమాచారాన్ని కోర్టుకు అందజేశారు. ఇక, సూరజ్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.. ఏడాదిన్నర తర్వాత సూరజే హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది. శిక్ష విధించింది.