ఏపీలో స్కిల్ స్కాం కేసులో గంటా సుబ్బారావును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై గంటా సుబ్బారావు తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గంటా సుబ్బారావు ఒక సాక్షి మాత్రమే అని, సాక్షిగా రమ్మని సమన్లు పంపి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సీమెన్స్ అగ్రిమెంట్ సమయంలో సుబ్బారావు లేరని, రాజ్యాంగ విరద్దుంగా సాక్షిని నిందితుడిగా చూపించారని అన్నారు. కుల ప్రాతిపదికన గంటా సుబ్బారావు ముందున్న అధికారిని పక్కన పెట్టారని, తన ప్రమేయం లేని దానిలో నిందితుడిగా చూపబడ్డాడని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Read: దారుణం: శ్రీనగర్‌లో పోలీసుల వాహనంపై ఉగ్రవాదుల దాడి…
అగ్రిమెంటులో సంతకం చేసిన సమయంలో గంటా సుబ్బారావు స్కిల్ డెవలప్మెంట్‌కు ఎండీ, సీఈఓ అని, డిజైన్ టెక్ అగ్రిమెంట్ సుబ్బారావుకు తెలిసే జరిగిందని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అసలు ఎటువంటి ప్రాజెక్టు జరగకముందే ప్రభుత్వ వాటా విడుదల చేశారని, సౌమ్యాద్రి శేఖర్ బోస్ రెండు చోట్ల రెండు రకాలుగా సంతకం పెట్టారని, అలాంటి అగ్రిమెంట్‌పై కూడా గంటా సుబ్బారావు సంతకం చేశారని అన్నారు. గంటా సుబ్బారావు బయటతిరిగితే మరిన్ని నేరాలు చేసే అవకాశం లేకపోలేదని, సాక్షిని నిందితుడిగా చూపించడం అనేది ఇన్వెస్టిగేషన్‌లో తేలిన విషయాల ఆధారంగా జరిగిందని, జుడిషియల్ కస్టడీకి అనుమతిస్తూ రిమాండ్ ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిసించారు.