సింహాద్రి అప్పన్నను శ్రీశారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు వెలిగించి స్వామిజీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సారి భోగి, సంక్రాంతి, కనుమకు ముందురోజు వైకుంఠ ఏకాదశి రావడం ఎంతో అదృష్టమని ఆయన అన్నారు. అదేవిధంగా భోగి మంటలు ఈ మంచి సమయంలో ప్రారంభించడం మహాత్భాగ్యంగా భావిస్తున్నాననన్నారు.
ముఖ్యంగా ఈ భోగి, సంక్రాంతి కనుమ పండుగను రైతుల పండుగగా చెప్పుకుంటామని, రైతులు పండించిన పంటలు బాగా పండితే ముందుగా ఆ సింహాద్రి అప్పనకే సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన అన్నారు. విశాఖ శారదాపీఠం యొక్క ఇల దేవుడు ఆ సింహాద్రి అప్పన్నేనని, ఈ మూడు పండుగలు వొచ్చాయంటే ఇక నుంచి ఉత్తరాయణంలో అడుగు పెడుతున్నట్లుగానే భావించాలి. వివాహాది శుభకార్యాలకు మంచిరోజులుగా చెప్పుకుంటామని స్వామిజీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్పన్న దేవాలయంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.