పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. దీంతో స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు విద్యార్ధులు. సూర్యాపేట జిల్లాలో ఓ హెడ్మాస్టర్ విద్యార్దుల్ని లైంగికంగా వేధించాడు. చదువు చెప్పాల్సిన హెడ్మాస్టర్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఆ కీచకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు.
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధినులను ప్రిన్సిపాల్ అనిల్ లైంగికంగా వేధించాడు. చుట్టుపక్కల గ్రామాలు, తండాలు విద్యార్ధినులు ఇక్కడికి విద్యాభ్యాసం కోసం వస్తుంటారు. అనిల్ చేష్టలతో స్కూల్‌కి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల స్కూల్‌కి వెళ్ళడం లేదని భావించారు తల్లిదండ్రులు. అసలు విషయం ఆరాతీసి అనిల్ తీరుపై మండిపడుతున్నారు. గ్రామస్తులు అంతా ఏకమై హెడ్మాస్టర్ పై ఫిర్యాదుచేశారు. కీచక టీచర్‌ని వెంటనే తొలగించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.