(జూన్ 14న వి.మధుసూదనరావు జయంతి)
తెలుగు చిత్రసీమలో యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి దర్శకుడిగా చరిత్ర సృష్టించారు వి.మధుసూదనరావు. ఆయన పూర్తి పేరు వీరమాచినేని మధుసూదనరావు అయినా, అందరూ ‘విక్టరీ’ మధుసూదనరావు అనే పిలిచేవారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు విజయకేతనం ఎగురవేయడంతో ‘విక్టరీ’ ఇంటిపేరుగా మారింది. ఇక ‘రీమేక్ కింగ్’ గానూ ఆయన అలరించారు. మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన పలు రీమేక్ మూవీస్ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలి నుంచీ అభ్యుదయభావాలు మనసులో నింపుకున్న మధుసూదనరావు ఛాందసభావాలను నిరసిస్తూ ఉండేవారు. చిత్రసీమలో ప్రవేశించాక కూడా అదే తీరున సాగిన మధుసూదనరావుకు విచిత్రంగా ‘సతీ తులసి’ పౌరాణికం రూపొందించే అవకాశం లభించింది. ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. అదే సమయంలో సినిమాల్లో నటించాలని మదరాసు చేరిన వి.బి.రాజేంద్రప్రసాద్ మనసు మార్చుకొని నిర్మాతగా మారారు. రాజేంద్ర ప్రసాద్ ‘జగపతి’ సంస్థ నెలకొల్పి మొట్టమొదటి సినిమాగా ‘అన్నపూర్ణ’ను నిర్మిస్తూ మధుసూదనరావును దర్శకునిగా ఎంచుకున్నారు. మధుసూదనరావును ఎందుకు ఎంచుకున్నావని రాజేంద్రప్రసాద్ మొహాన్నే చెప్పినవారూ ఉన్నారు. అయితే ఒకే ప్రాంతం వారు కావడంతో మధుసూదనరావు దర్శకత్వంలోనే ‘అన్నపూర్ణ’ను నిర్మించారు. జగ్గయ్య, జమున జంటగా నటించిన ఆ సినిమా మంచి ఆదరణ చూరగొంది. తరువాత మధుసూదనరావు దర్శకత్వంలోనే రాజేంద్రప్రసాద్ వరుసగా “ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు” చిత్రాలను నిర్మించి, జనాన్ని ఆకట్టుకున్నారు. మరోవైపు మధుసూదనరావు ఇతర నిర్మాతలతోనూ విజయపథంలో పయనించారు.
రీమేక్ కింగ్…
మధుసూదనరావుకు ‘రీమేక్ కింగ్’ అని పేరు రావడానికి కారణం, ఆయన రీమేక్స్ భలేగా తెరకెక్కిస్తారనే భావిస్తారు. నిజానికి ఓ భాషలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని మరో భాషలో అంతకంటే బాగా తీయడం అంత సులువు కాదు. మధుసూదనరావు మాత్రం తనదైన పంథాలో పయనిస్తూ, తన దరికి చేరిన రీమేక్స్ ను విజయాల బాట పట్టించేవారు. అలా ఆయన దరికి చేరిన తొలి రీమేక్ ‘రక్తసంబంధం’. తమిళంలో విజయం సాధించిన ‘పాశమలర్’ ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. ఇందులో యన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్ళుగా నటించి మెప్పించారు. 1962లో రూపొందిన ‘రక్తసంబంధం’ను తెలుగు వాతావరణానికి అనువుగా రూపొందించారు మధుసూదనరావు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. నిజం చెప్పాలంటే మధుసూదనరావుకు తొలి ఘనవిజయం ఇదే! బెంగాలీ మూవీ ‘సాగరిక’ ఆధారంగా ‘ఆరాధన’, మరో బెంగాలీ చిత్రం ‘అగ్నిసంస్కార్’ రీమేక్ గా ‘ఆత్మబలం’, తమిళ ‘ఆలయమణి’ ఆధారంగా ‘గుడిగంటలు’, మళయాళ ‘తులాభారం’ రీమేక్ గా ‘మనుషులు మారాలి’, కన్నడ ‘గజ్జెపూజ’ తో ‘కళ్యాణమండపం’, తమిళ ‘సవాలే సమాలి’ ద్వారా ‘మంచిరోజులు వచ్చాయి’, కన్నడ ‘శరపంజర’ ఆధారంగా ‘కృష్ణవేణి’ , ‘దో యార్’ రీమేక్ గా ‘ఇద్దరూ ఇద్దరే’, ‘అమానుష్’ ద్వారా ‘ఎదురీత’, ‘ప్యాసా’ ఆధారంగా ‘మల్లెపువ్వు’, కన్నడ ‘తాయిగె తక్క మగ’తో ‘పులిబిడ్డ’ వంటి చిత్రాలను తీసి ‘రీమేక్ కింగ్’గా పేరు సంపాదించారు మధుసూదనరావు.
అనుకున్నది సాధించి…
మధుసూదనరావు తొలి చిత్రం ‘సతీ తులసి’ పరాజయం పాలయినప్పుడు అందరూ కమ్యూనిస్ట్ కు పౌరాణికం అప్పగిస్తే ఇట్టాగే ఉంటుందని గేలి చేశారు. అయితే తప్పకుండా పౌరాణికంతో విజయం సాధించాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని తన ‘రక్తసంబంధం’ నిర్మాతలు సుందర్ లాల్ నహతా, డూండీకి చెప్పారు. వారు కూడా ఆయనకు సహకారం అందించారు. తత్ఫలితంగా రూపొందిన చిత్రమే ‘వీరాభిమన్యు’. ఈ పౌరాణిక చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులో అభిమన్యునిగా నటించిన శోభన్ బాబుకు మంచి పేరు లభించింది. శోభన్ బాబు స్టార్ డమ్ చేరుకోవడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ఆ సమయంలో మధుసూదనరావు చిత్రాలే శోభన్ కు అండగా నిలిచాయి. అలా ‘వీరాభిమన్యు’తో సక్సెస్ చూసిన మధుసూదనరావు పట్టుదలను అందరూ అభినందించారు.
మరికొన్ని…
మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ మధుసూదనరావుకు ఎంతో అనుబంధం ఉంది. వీరిద్దరి చిత్రాల ద్వారా ఆయనకు ‘విక్టరీ’ ఇంటిపేరుగా మారింది. యన్టీఆర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘లక్షాధికారి’ని కూడా సక్సెస్ రూటులో సాగేలా చేశారు మధుసూదనరావు. ఈ ‘లక్షాధికారి’తోనే తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాతగా మారడం విశేషం. ఏయన్నార్ నాయకునిగా రూపొందిన ‘భక్త తుకారాం’ కూడా మంచి విజయం సాధించింది. ఏయన్నార్ తో జగపతి బ్యానర్ లో రూపొందించిన చిత్రాలు కాకుండా, “జమీందార్, మంచికుటుంబం, ఆత్మీయులు, పవిత్రబంధం, మంచివాడు” వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు మధుసూదనరావు. ఇక యన్టీఆర్ తో “ఎదురీత, సూపర్ మేన్” వంటి చిత్రాలనూ తెరకెక్కించి ఆకట్టుకున్నారు. సూపర్ హీరో స్టోరీతో రూపొందిన ‘సూపర్ మేన్’గా యన్టీఆర్ ను జనం ముందు నిలిపిందీ ఆయనే! ‘ఆత్మీయులు, ప్రేమలు-పెళ్ళిళ్ళు, చక్రవాకం, చండీప్రియ’ వంటి నవలా చిత్రాలు మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందాయి. వీటిలో ‘ఆత్మీయులు’ మంచి విజయం సాధించింది. శోభన్ బాబు తో తీసిన ‘జేబుదొంగ, జూదగాడు’ కూడా ఆకట్టుకున్నాయి. కృష్ణంరాజుతో రూపొందించిన ‘బెబ్బులి’ మంచి ఆదరణ పొందింది. మధుసూదనరావు దర్శకత్వంలో కన్నడ, హిందీ చిత్రాలు కూడా రూపొందాయి.
మధుసూదనరావు హైదరాబాద్ చేరి, తెలుగువారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ‘మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్’ నెలకొల్పారు. ఈ ఇన్ స్టిట్యూట్ ద్వారా శివాజీరాజా, శ్రీకాంత్, సూర్య వంటివారు వెలుగు చూశారు. వారు చిత్రసీమలో ఇప్పటికీ రాణిస్తున్నారు. మధుసూదనరావుకు అసోసియేట్స్ గా పనిచేసిన కె.రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి, పి.చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ గాంధీ వంటివారు తరువాతి రోజుల్లో దర్శకులుగా జయకేతనం ఎగురవేశారు. దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు మధుసూదనరావు. 1997లో మధుసూదనరావుకు శిష్యులందరూ ఘనంగా సన్మానం చేశారు. ఆ నాటి ఆ సభలో దాసరి, రాఘవేంద్రరావు తదితరులు ఆయనను సన్మానించిన తీరును ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటారు. ఏది ఏమైనా ‘విక్టరీ’ మధుసూదనరావుగా జనం మదిలో నిలిచపోయారాయన.