మొన్నటి దాకా ఎనర్జిటిక్ స్టార్ గాజేజేలు అందుకున్న రామ్, ఇప్పుడు ఇంటిపేరును కలుపుకొని ‘రామ్ పోతినేని’గానూ, షార్ట్ కట్ లో ‘రాపో’గానూ సందడి చేస్తున్నాడు. రామ్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచిన ‘ఇస్మార్ట్ శంకర్’లో ఉస్తాద్ గానూ నటించడంతో, అభిమానులు ‘ఉస్తాద్ రాపో’ అంటూ జేజేలు పలుకుతున్నారు. సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ రామ్ కు దూకుడెక్కువ అన్న సంగతి అతని ట్వీట్స్ ద్వారా జనానికి తెలిసింది. సంక్రాంతి సంబరాల్లో తాను ద్విపాత్రాభినయం చేసిన ‘రెడ్’ సినిమాతో తన ప్రత్యేకత చాటుకున్నాడు.
ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ సోదరుడు మురళీ పోతినేని తనయుడే రామ్. చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంతో పరిచయం ఉండడం వల్ల రామ్ మనసు బాల్యంలోనే నటనవైపు సాగింది. పదునాలుగేళ్ళ ప్రాయంలోనే ‘అదయాలం’ అనే తమిళ లఘు చిత్రంలో నటించేశాడు. తన 17వ యేట వై.వి.ఎస్.చౌదరి తెరకెక్కించిన ‘దేవదాస్’లో తొలిసారి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాలోనే తన ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో జనానికి పరిచయం చేశాడు. దాంతో ‘ఎనర్జిటిక్ స్టార్’గా రామ్ నిలిచాడు. అప్పటి నుంచీ మొన్నటి ‘రెడ్’ దాకా 18 చిత్రాలలో నటించిన రామ్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. రామ్ చిత్రాలలో “రెడీ, మస్కా, కందిరీగ, పండగ చేస్కో, నేను-శైలజ, ఇస్మార్ట్ శంకర్” వంటివి జనాదరణ పొందాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా రామ్ తన కృషినే నమ్ముకొని సాగుతున్నాడు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే రామ్ కొత్త సినిమా ఈ పాటికి పట్టాలెక్కి ఉండేది.
‘ఉస్తాద్ రాపో’ బర్త్ డేను ఈ సారి భలేగా జరపాలనుకున్నారు అభిమానులు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అందరూ ఎవరికి వారు తమ పరిధిలో రామ్ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.