రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయంటే షెడ్యూలింగ్‌లో అనూహ్యమైన మార్పులు చేర్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సిగ్నలింగ్ సమస్యలు, అనుకోని అంతరాయాలు.. ఇలా పలు కారణాలు చెప్పొచ్చు. అయితే పశువుల వల్ల కూడా రోజుకి సగటున 11 రైళ్లు లేట్‌గా రాకపోకలు సాగిస్తున్నాయని రైల్వే శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల రైల్వేలకు భారీగా నష్టాలొస్తున్నాయి. మేత కోసం పశువులు రైల్వే ట్రాక్‌ల మీదికి వస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. అదే సమయంలో రైళ్లకు ఆటంకం కలిగిస్తున్నాయి.
ఈ కారణంగా గత (2021-22) ఆర్థిక సంవత్సరంలో రోజుకి యావరేజ్‌గా 6 రైళ్లే ఆలస్యంగా నడవగా ఈ సంఖ్య గత రెండు నెలల్లో ఏకంగా 11కి పెరిగింది. 2021 మార్చి నుంచి 2022 ఏప్రిల్ వరకు మొత్తం 2,115 రైళ్ల ఆపరేషనల్ షెడ్యూల్ పైన పశువుల ప్రభావం పడింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు (తొలి త్రైమాసికంలో) 990 రైళ్లు ప్రభావితమయ్యాయి. జూన్ నాటికి మొత్తం 1,300 పశువులు రైళ్ల కింద పడి చనిపోయాయని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సమస్య ఎక్కువగా నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్ జోన్లలో చోటుచేసుకుంటోంది.
ఈ జోన్ల పరిధిలోకి యూపీ, పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లోని అధిక ప్రాంతాలు వస్తాయి. ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రైల్వే ట్రాక్‌ల పక్కన ఫెన్సింగ్ ఏర్పాటుచేసినా ఇలాంటి రక్షణ కవచం లేని కారిడార్లు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దారితప్పిన పశువులే అధికంగా రైల్వే ట్రాక్‌ల మీదికి వస్తున్నట్లు చెబుతున్నారు. వాటి వల్ల గూడ్స్ రైళ్లతోపాటు ప్యాసింజర్ ట్రైన్లు కూడా లేట్‌గా నడవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. గతంతో పోల్చితే ఈ ప్రమాదాల సంఖ్య ఇప్పుడు తగ్గింది. కానీ ఆలస్యంగా రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య పెరుగుతోందని అధికారులు అంటున్నారు. రైల్వేలకు ఇదొక ఛాలెంజ్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది.