భద్రాచలం పట్టణంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లుతో స్థానికంగా కలకలం రేపుతున్నాయి.. ఎక్కువగా మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే తాజాగా వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ప్రజలు ప్రశ్నిస్తున్నట్లుగా పట్టణంలో అక్కడక్కడ పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా మావోయిస్టుల పార్టీకీ సూటి ప్రశ్నలు వేసినట్లు ఈ పోస్టర్లలో సారాంశం ఉంది.
నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా? అభివృద్ధిని అడ్డుకోవడం నక్సలిజమా? ప్రజా విప్లవం అంటే విధ్వంసమా? తుపాకీ గొట్టం ద్వారా 50 సంవత్సరాలలో సాధించింది ఏమిటి? అదివాసులారా… మీ మద్దతు విధ్వంసానికా…! అభివృద్దికా…! పీఎల్‌జీఏ వారోత్సవాలు అంటే ప్రజలను పీడించడమేనా? ఇంటికి 50 రూపాయలు మరియు 1 KG బియ్యం బలవంతంగా సేకరించడమేనా వారోత్సవాలు అంటే? ఆటోకు 500 రూపాయలు, ట్రాక్టర్ కు 500 రూపాయలు పన్ను విధించి బలవంతంగా వసూలు చేయడమేనా వారోత్సవాలు అంటే? అమాయక ప్రజలను పార్టీలో చేరమని ప్రోత్సహిస్తూ వారి జీవితాలను నాశనం చేయడమేనా వారోత్సవాలు అంటే? అంటూ మావోయిస్టుల విధానాలను ప్రశ్నిస్తున్నట్లు ఉంది.