ఇటీవలి లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి నిరాశ మిగిల్చాయి. మోడీ ప్రభుత్వ వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయి. పెట్రో ధరలు. రైతు ఆందోళనలు.. నిరుద్యోగం. తగ్గిన మోడీ గ్రాఫ్. ఈ అంశాలన్నీ ప్రభావం చూపాయనటంలో అనుమానం లేదు. మామూలుగా అయితే ఈ ఫలితాలను బీజేపీ పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ కొన్ని నెలల వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఈ వ్యతిరేకత కంటిన్యూ అయితే కష్టాలు తప్పవన్న భావనలో కమళనాధులు ఉన్నట్టు కనిపిస్తోంది.
రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర ప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ పాలన పట్ల యూపీ ప్రజలు ఆగ్రహంతో లేకపోవచ్చు. కానీ, సంతృప్తికరంగా లేరన్నది నిజం. లఖీంపుర్ ఖేరీ ఘటన, కోవిడ్ నిర్వహణా లోపాలు, రైతు ఆందోళనల విషయంలో సర్కార్ తీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల నాటికి అది ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేము. దీనిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. మరోవైపు, కాంగ్రెస్ కూడా యూపీ ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకుంది. సరికొత్త రాజకీయాలకు తెరతీసింది. పార్టీ ఇంఛార్జీ ప్రియాంకా గాంధీ అనుసరిస్తున్న వ్యూహాలు ఫలిస్తే హస్తం పార్టీ కచ్చితంగా గేమ్ ఛేంజర్ అవుతుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
జనాభా పరంగా ఉత్తర్‌ప్రదేశ్ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. చారిత్రకంగా, సాంస్కృతికంగా కూడా ఘన చరిత్ర కలిగిన ప్రాంతం. స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించింది. రాజకీయంగా కూడా అత్యంత కీలకమైనది. ఢిల్లీని గెలవాలంటే ముందు యూపీని గెలవాలంటారు. నిజమే, ఉత్తరప్రదేశ్‌ని గెలవకుండా హస్తినను చేజిక్కించుకోవటం కష్టం. మరో నాలుగు నెలల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలతో పాటు నేతల మాటల యుద్ధం కూడా మొదలైంది.
దేశ జనాభాలో పదహారు శాతం .. అంటే దాదాపు పాతిక కోట్ల మంది ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉన్నారు. విస్తీర్ణంలో నాల్గవ అతి పెద్ద రాష్ట్రం. 75 జిల్లాలు, 80 లోక్‌సభ స్థానాలు, 31 రాజ్యసభ సీట్లు .. 404 మంది శాసన సభ్యులు, 100 ఎమ్మెల్సీలు యూపీ సొంతం. నెహ్రూ, శాస్ర్తి, ఇందిర, రాజీవ్, వీపీ సింగ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, వాజ్‌పాయి.. ఇప్పుడు మోడీని కలుపుకుంటే మొత్తం తొమ్మిది మంది ప్రధానులను అందించింది. ఇవన్నీ కలిసి భారత రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కి ఓ ప్రత్యేక స్థానం కల్పించాయి.
ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని శతాబ్దాలపాటు ఎదురులేకుండా పాలించింది. యూపీలో ప్రభ తగ్గిన తరువాతే దేశ రాజకీయాలపై కాంగ్రెస్ పట్టు కోల్పోవటం ప్రారంభమైంది. గడచిన ముప్పయ్ ఏళ్లలో హస్తం పార్టీ ఇక్కడ నామ మాత్ర పార్టీ స్థాయికి పడిపోయింది. కుల రాజకీయాలు తెర మీదకు వచ్చిన తరువాత దళితులు ఆ పార్టీకి దూరమయ్యారు. దాంతో యూపీలో కాంగ్రెస్ బలహీనపడటం ప్రారంభమైంది. ఐతే, సీట్ల పరంగా హస్తం పార్టీ బలం కోల్పోవచ్చు. కానీ నెహ్రూ – గాంధీ కుటుంబానికి జనంలో ఇప్పటికీ అంతో ఇంతో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ తనను తాను నిరూపించుకోవాలని మరోసారి ప్రయత్నిస్తోంది. ఐతే, అధికార బీజేపీ, బలమైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలకు ఎదురు నిలిచి వంటరిగా సత్తా చూపించాలని బావిస్తోంది.
వచ్చే ఏడాది మార్చితో ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగుస్తుంది. అంటే మరో నాలుగు నెలలు. బహుశా 2022 జనవరిలో నోటిఫికేషన్ వెలువడ వచ్చు. అంటే నూతన సంవత్సరం ప్రారంభంలోనే దేశంలో మరోసారి ఎన్నికల ఫీవర్ మొదలవుతుంది. సమయం దగ్గరవుతున్నందున బీజేపీ, సమాజ్‌వాది పార్టీ-ఎస్పీ , బహుజన్ సమాజ్ పార్టీ – బీఎస్పీ , కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి.
ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. 1950- 1989 మధ్య యూపీని కాంగ్రెస్ అప్రతిహాతంగా పాలించింది. మండల్ ఉద్యమం తరువాత దేశ వ్యాప్తంగా కులాల వారీ ఓటు బ్యాంకులు ఏర్పడ్డాయి. అవి యూపీలో మరీ ఎక్కువగా ఉన్నాయి. 2017 ఎన్నికల్లో కులం స్థానాన్ని హిందుత్వం ఆక్రమించింది. ఇప్పుడు లౌకిక పార్టీల పోరాటం అంతా ఆ హిందుత్వ రాజకీయాల మీదే నడుస్తోంది. అది వేరే సంగతి. దాదాపు పాతిక కోట్ల జనాభా గల యూపీలో చాలా రాజకీయ సమీకరణలను చూస్తాం. ప్రాంతాల వారీగా విభిన్న పరిస్థితును..విభిన్న సామాజిక వర్గాలు…సమస్యలను చూస్తాం. ఉదాహరణకు పశ్చిమ యూపీని రైతు సమస్యలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కరువు ప్రాంతం బుందేల్‌ఖండ్‌లో తీవ్ర నీటి సమస్య. ఇది దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. అవధ్ లో కోవిడ్ నిర్వహణ వైఫల్యాలు .. పూర్వాంచల్ లోని యోగీ ఇలాఖా గోరఖ్‌పూర్‌లో బ్రెయిన్ ఫీవర్ పెద్ద సమస్య. ఈసారి ఎన్నికలను ఇలాంటి అంశాలెన్నో ప్రభావితం చేయనున్నాయి. వీటికి తోడు నెరవేర్చని వాగ్దానాలు ఉండనే ఉన్నాయి.
నిరుద్యోగ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లపై ప్రభావం చూపే అంశం. అధ్వాన్నమైన రోడ్లు, రహదారులు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఇటీవల వర్షాలకు వారణాసి నీట మునిగింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆశించినంత లేదు. వారణాసిని మరో టోక్యోని చేస్తా అన్నారు ప్రధాని మాట ఏమైందని జనం నిలదీస్తున్నారు. కరోనా వల్ల ఈ ప్రాంతంలోని నేత కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఈ అంశాలన్నిటిని ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకుపోవచ్చు.
యూపీ ఎన్నికలపై కులం రాజకీయాలు ఏ స్థాయిలో ప్రభావం చూపగలవో.. మతతత్వ రాజకీయాలు కూడా అదే స్థాయిలో తన ప్రభావం చూపుతాయి. ఎన్నికలు సమీపించే కొద్ది ఒక్కో అంశం తెరమీదకు వస్తుంది. యూపీలో ఇప్పుడు ఆ ఆట మొదలైనట్టు కనిపిస్తోంది. రాజకీయ నాయకుల ప్రకటనల్లో హిందూ-ముస్లింల ప్రస్తావన పెరుగుతోంది. బీజేపీ ఎప్పటిలాగే పోలరైజేషన్ పాలిటిక్స్‌ను ఆశ్రయిస్తుంది. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని ఈసారి ఎన్నికల ప్రధాన అస్త్రంగా వాడుకోవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ విజయంలో మోడీ ఇమేజ్ కీలక పాత్ర పోషించింది. రేపటి ఎన్నికలు యోగి ఆదిత్యానాథ్ పాలనపై ప్రజా తీర్పు.
గత ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 312 సీట్లు సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 47, బీఎస్పీ 19 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇక కాంగ్రెస్‌కు ఏడంటే ఏడు సీట్లు వచ్చాయి. ఈసారి కూడా ఒంటరిగా బరిలో దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ ఇప్పటికే ప్రకటించాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ మధ్య పొత్తు ఉంది. ఐతే ఈసారి కాంగ్రెస్‌ను కలుపుకునే ప్రసక్తే లేదని ఎస్పీ ఇప్పటికే తేల్చి చెప్పింది. బీహార్‌లో ఆర్జేడీ అనుభవంతో ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎంఐఎం కూడా యూపీ ఎన్నికల బరిలో దిగనుంది. ఆ పార్టీ చీల్చే ఓట్లతో నష్టం జరిగేది ఎస్పీకే. గత ముప్పయ్ ఏళ్లుగా ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కొంత వరకు బీజేపీ వైపు మొగ్గారు. ముస్లింల ఆధిపత్యం కలిగిన చాలా సీట్లలో బీజేపీ చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని మైనార్టీ ఓట్ల కోసం బీజేపీ ఈ సారికి పగడ్బందీ పథక రచన చేస్తోంది.
ముస్లింలను తమ వైపు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ ‘తలీమ్ ఔర్ తిజారత్’ అంటే చదువు..వాణిజ్యం అనే అంశంపై ‘టిఫిన్ సమావేశాలు’, సెమినార్లు , వర్క్ షాప్‌ల నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. వీలైనంత ఎక్కువ మంది మైనార్టీ ఓటర్లను కలవాలని కార్యకర్తలకు పార్టీ ఆదేశాలు వెళ్లాయి. ఈ కార్యక్రమాల ద్వారా ముస్లిం ఓటర్లకు చేరువ కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలకు సూచించింది.
ఉత్తరప్రదేశ్ జనాభాలో ముస్లిం వాటా దాదాపు 19 శాతం. అంటే మొత్తం జనాభాలో నాలుగు కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. 2017 ఎన్నికల్లో వీరి ప్రాభల్యం కలిగిన చోట తక్కువ తేడాతో ఓడిపోయిన సీట్లపై ఫోకస్ పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. గత ఏడేళ్లలో మోడీ సర్కార్ విధానాలు..అభివృద్ధి కార్యక్రమాలను ముస్లిం వర్గాలలో హైలైట్ చేయాలన్నది ప్లాన్.
బ్లాక్, జిల్లా స్థాయి నుంచి మంత్రుల వరకు అన్ని స్థాయిల నాయకులు ముస్లింలతో మాటా మంతీ జరుపుతారు. ఇందుకు వారు లంచ్ టైమ్‌ని ఎంచుకున్నారు. వెంట తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ను వారితో షేర్ చేసుకుంటూ ముచ్చటిస్తారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు.. గృహనిర్మాణం.. ఉద్యోగ అవకాశాల సృష్టి ఇలా మైనారిటీ కమ్యూనిటీ కోసం బీజేపీ చేసిన కృషిని ఈ సందర్భంగా మాట్లాడతారు. ఇలా ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తారు.
బీజేపీ తన ప్లాన్ అమలుకు ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల మంది మైనార్టీ కార్యకర్తలను సిద్దం చేస్తోంది. వీరిలో వంద మంది ఒక్కొక్కరు కనీసం 50 కుటుంబాలను పరిచయం చేసుకుంటారు. గత ఎన్నికల్లో చాలా ముస్లిం మెజార్టీ సీట్లలో బీజేపీ చాలా తక్కువ తేడాతో ఓడిపోయింది. ఉదాహరణకు శహరన్‌పూర్‌లో సమాజ్ వాదీ పార్టీ నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇలాంటి సీట్లు చాలా ఉన్నాయి. ఈ తరహా వ్యూహాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని బీజేపీ మైనార్టీ విభాగం ఇప్పటికే నిర్ణయించింది.
మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ కూడా మైనార్టీలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను అఖిలేష్ యాదవ్ ఇటీవల పొగడ్తలతో ముంచేయటం దీనిని సూచిస్తుంది. గత నెల 31న జరిగిన పార్టీ బహిరంగ సభలో జిన్నా స్వాతంత్ర్య పోరాట యోధుడని కొనియాడాడు. సహజంగానే అఖిలేష్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అఖిలేష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి ప్రకటనలతో ఒక వర్గాన్ని సంతోషపెట్టాలనుకోవటం తప్పన్నారు.
మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జంప్ జిలానీలు లాభసాటి బేరాలు చూసుకుంటున్నారు. అలాంటి వారికి ఎస్పీ గాలం వేస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలు, అసమ్మతి నాయకులు, తిరుగుబాటు శాసనసభ్యులు తమ పార్టీలోకి రావచ్చంటూ అఖిలేష్ ప్రకటించారు. ఇది ప్రత్యర్థి రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. బహుజన్ సమాజ్ వాది పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆరుగురు ఎమ్మెల్యేలు అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. ముందు ముందు మరింత మంది ఎస్పీ వైపు చూసే అవకాశం ఉంది. ఇక అఖిలేష్ చిన్నాన్న శివపాల్ యాదవ్ కు చెందిన ప్రగతిశీల్ సమాజ్ వాది పార్టీ ఎస్పీతో జత కలసింది. రాష్ట్రీయ లోక్ దళ్ తోనూ పొత్తు ఖరారైంది. ఓం ప్రకాష్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ తమ కలిసి నడుస్తున్నట్టు సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. ఇదిలావుంటే, తాను అసెంబ్లీకి పోటీ చేయనని అఖిలేష్ యాదవ్ ప్రకటించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. దీని వెనక ఏదో వ్యూహం ఉండే ఉంటుందని రాజకీయ వర్గాల టాక్.
మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్‌వాది పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని ప్రకటించింది. 2007 ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తామని దీదీ ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికలను ఆ రెండు పార్టీలు కేవలం హిందూ-ముస్లింలకు సంబంధించినదిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయని ఎస్పీ, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక అధికార బీజేపీ ఏడు చిన్న పార్టీల కూటమితో పొత్తు కుదుర్చుకుంది. ఇవి వివిధ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బీజేపీ మాజీ మిత్రపక్షం సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ గత నెలలో ఎస్పీతో జతకట్టింది. దాంతో అలర్టయిన బీజేపీ వీటి మీద ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని ఏడు కుల ప్రధాన పార్టీలతో గత నెలలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పార్టీలన్నీ హిస్సేదార్ మోర్చా భాగస్వాములు. బింద్, గదరియా, కుమ్హార్, ధివర్, కశ్యప్, రాజ్‌భర్ వంటి ఓబీసీ పార్టీలె కలిసి హిస్సేదార్ మోర్చగా ఏర్పడ్డాయి. వాటిలో కొన్ని గతంలో రాజ్‌భర్ నేతృత్వంలోని భగీదారి సంకల్ప్ మోర్చాతో ఉన్నారు. 2022 ఎన్నికల కోసం ఏర్పడిన కూటమి ఇది. అయితే ఇందులో ఎంఐఎం కూడా భాగస్వామిగా ఉండటంతో కొందరు దీని నుంచి బయటకు వెళ్లి హిస్సేదార్ కూటమిగా ఏర్పడ్డారు.
వచ్చే ఎన్నికలలో బీజేపీ నుంచి ఈ కూటమి 15 సీట్లు ఆశిస్తోంది. తమకు వివిధ కులాల మద్దతు ఉందని కూటమి నాయకులు అంటున్నారు. యాదవేతర ఓబీసీలు, దళితులపై బీజేపీ దృష్టి సారించిందని ఈ పార్టీలు గ్రహించాయి. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీతో కలిసి వెళుతున్న ఏడు పార్టీలు భారతీయ మానవ్ సమాజ్ పార్టీ, శోషిత్ సమాజ్ పార్టీ, భారతీయ సుహెల్దేవ్ జనతా పార్టీ, భారతీయ సమతా సమాజ్ పార్టీ, మానవిహిత్ పార్టీ, పృథ్వీరాజ్ జనశక్తి పార్టీ, ముసహర్ ఆందోళన్ మంచ్ (గరీబ్ పార్టీ).
భారతీయ సమాజ్ పార్టీ 2017 ఏర్పడింది. ఈ పార్టీ బింద్ సామాజిక వర్గానికి ప్రతినిధ్యం వహిస్తోంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పది జిల్లాలలో వీరు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ వీరికి 6శాతం ఓట్లున్నాయి. ప్రయాగ్‌రాజ్, జాన్‌పూర్, వారణాసి, మీర్జాపూర్, సోన్‌భద్ర, ఘాజీపూర్ ఈ ప్రాంత పరిధిలోలోనే ఉన్నాయి. బింద్ ఓట్లు ఇక్కడి అసెంబ్లీ స్థానాల్లో పార్టీల గెలుపు ఓటములను శాసిస్తాయి. గతంలో వీరు ఎస్పీ, బీఎస్పీ పక్షాన నిలిచారు.
శోషిత్ సమాజ్ పార్టీ బలహీన వర్గాల పక్షం వహిస్తోంది. ముఖ్యంగా రాజ్‌భర్లకు మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. తూర్పు యూపీలో రాజ్‌భర్ జనాభా 14 నుంచి 22 శాతం వరకు ఉంటుంది. ఇక భారతీయ సుహేల్‌దేవ్ జనతా పార్టీ గత ఏడాదే ఏర్పడింది. ఇది బలియా జిల్లా పరిధిలో రాజ్‌భర్లపై ఫోకస్ పెట్టింది.
భారతీయ సమతా సమాజ్ పార్టీ 2008లో ఏర్పడింది. ఓబీసీకి చెందిన ప్రజాప్రతి కమ్యూనిటీ కోసం పనిచేస్తుంది. వారి ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తోంది. మొత్తం రాష్ట్ర జనాభాలో వీరు ఐదు శాతం వరకు ఉంటారు. ఈ ప్రజాపతిలు ఎక్కువగా కుమహార్‌లు. కుండల తయారీ వీరి కులవృత్తి. గతంలో ఈ పార్టీ సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పనిచేసింది. అయితే 2017 ఎన్నికల సమయంలో ఈ పార్టీలో చాలా మంది బీజేపీ వైపు వెళ్లిపోయారు. వీరి అభ్యున్నతి కోసం “మటి కళా బోర్డ్ ” ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కొద్ది నెలల క్రితం ప్రకటించారు. బీజేపీ పక్షం వహించటానికి ఇది కూడా ఒక కారణం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ మూడు సీట్లలో పోటీ చేసింది. ఒక్కదానిలో కూడా డిపాజిట్ దక్కలేదు.
మానవ్‌హిత్ పార్టీ 2015లో ఏర్పడింది. నిషాద్స్ ఉపకులం కశ్యప్‌ల పక్షాన పనిచేస్తుంది ఇది. 1998 నుంచి 2014 వరకు ఇది బీఎస్పీ మిత్రపక్షంగా ఉంది. వీరు మొత్తం జనాభాలో 3 శాతం వరకు ఉంటారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. 2022 ఎన్నికల్లో కలిసి పోటీచేద్దమని మాట ఇచ్చింది కానీ తరువాత పట్టించుకోలేదని..అందుకే హిస్సేదార్ మోర్చలో జాయిన్ అయింది.
పృథ్విరాజ్ జనశక్తి పార్టీ 2018 లో ఏర్పడింది. ఇది నోనియా కులం కోసం పనిచేస్తుంది. ఈ కులం ప్రధానంగా తూర్పు యూపీలో కనిపిస్తుంది. వారణాసి, చందౌలీ, మీర్జాపూర్ జల్లాల్లో వీరికి 3 శాతం ఓట్లున్నాయి. ఇక మూసహార్ ఆందోళన్ మోర్చా 2002లో ఏర్పాటైంది. ఇది గరీబ్ పార్టీ పేరుతో రిజిస్ట్రేన్‌కు దరఖాస్తు చేసుకుంది. ఘజియాబాద్ జిల్లాలో క్రియాశీలంగా ఉంది. దళితులు, మూసహార్‌లపైనే దీని ప్రధాన ఫోకస్. తూర్పు యూపీలో ఈ కులానికి ఒక శాతం ఓట్లున్నాయి.
మొత్తం మీద వివిధ జిల్లాలలో ఈ ఏడు పార్టీలు తమదైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. వీరంతా బలహీన వర్గాలకు చెందన వారు. ఈ పొత్తు ద్వారా వారికి బీజేపీ పెద్ద వేదికనే ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. తూర్పు యూపీలో 25 శాతం జనాభాపై ఈ ఏడు పార్టీల ప్రభావం ఉంటుంది. ఘజియాపూర్, బలియా, ఆజంఘడ్, జాన్‌పూర్, వారణాసి జిల్లాలలో బీజేపీకి ఈ పార్టీలు పస్ల్ అవుతాయి. ఈ ఐదు జిల్లాల్లో 50కి పైగా అసెంబ్లీ సీట్లున్నాయి. సమాజ్‌వాదీ పార్టీని కౌంటర్ చేయటంలో ఈ ఏడు పార్టీలు ఇక్కడ బీజేపీకి అండగా నిలుస్తాయి.
2014 ఎన్నికల ముందు వరకు ఓపీ రాజ్‌భర్, సంజయ్ నిషాద్, అనుప్రియ పటేల్ ఎవరో కూడా ప్రజలకు తెలియదు. తమతో చేతులు కలిపిన తరువాతే వారి విలువ పెరిగిందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఐతే ఈ ఏడు పార్టీలు, వాటి నేతలు చాలా చిన్నవారని ..కులాలను పెద్దగా సమీకరించటం ఏ మేరకు సాధ్యమవుతుందనేది చూడాల్సి వుందని పరిశీలకులు అంటున్నారు.
యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ప్రియాంక గాంధీ చాలా క్రియాశీలంగా కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన లఖింపూర్ ఖేరి ఘటన ఆమెకు రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఈ ఘటన తరువాత ఆమె అనూహ్యంగా యూపీ రాజకీయాల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. లఖింపూర్ ఖేరి ఘటన అనంతర పరిణామాలతో ఆమె యావత్ రాష్ట్రాన్ని తన వైపు తిప్పుకోగలిగారు. ఇదే సమయంలో మహిళలు, యువతకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రియాంక తన పర్యటనల్లో హామీల వర్షం కురిపిస్తున్నారు. కుల రాజకీయాలకు కౌంటర్ గా మహిళా శక్తిని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారామె. అందులో భాగమే 40 శాతం సీట్ల కేటాయింపు ప్రకటన. అంతే కాదు మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో కూడా రూపొందిస్తున్నారు. అమ్మాయిలకు ఉచి స్కూటీ, మొబైల్ ఫోన్లు..ఇలాంటి వన్నీ మహిళా ఓటర్లకు గాలం వేసే హామీలే.
అలాగే రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యపై కూడా ప్రియాంక ప్రధానంగా మాట్లాడుతున్నారు. రుణ మాఫీతో పాటు, వరి, గోధుమలకు 25 వందల రూపాయల కనీస మద్దతు ధర కల్పిస్తామంటున్నారు. అలాగే నిరుద్యోగ సమస్య. రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఇక కరోనా కష్ట కాలం నుంచి బయటపడేందుకు ప్రతి పేద కుటుంబానికి 25 వేలు అందిస్తామని చెపుతున్నారు. ఉచిత విద్యుత్, 10 లక్షల వరకు ఆరోగ్య భీమా వంటి హామీలు ఎన్నో ఉన్నాయి లిస్టులో. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ మాంచి ప్రజాకర్షణ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి దాని పట్ల యూపీ ప్రజల స్పందన ఎలా ఉంటుందోఎ ఎన్నికల తరువాత గానీ తెలియదు.
-Dr.Ramesh Babu Bhonagiri