టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని, త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పనిచేయాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు.
ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతో పాటు పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారని వస్తున్నవార్తలు విచారం కలిగిస్తున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా పరీక్ష కేంద్రాలను పెంచాలని, మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ లేకండా బయటకు రాకండి అని పవన్ కోరారు.