Site icon NTV Telugu

వైసీపీ పాపాలకు ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయి: పవన్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ నేతలు చేసిన పాపాలకు ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు. వరదల బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇద్దామంటే.. ప్రజల కోసం ఖర్చు పెడతారనే నమ్మకం లేదని పవన్ ఆరోపించారు.

Read Also: కావాలంటే నా సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తా: పవన్ కళ్యాణ్

మరోవైపు వైసీపీ నేతలకు పాదయాత్రలు చేసే అలవాటు ఉందని… విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం వైసీపీ నేతలు పాదయాత్ర చేస్తే మొదటగా తానే మద్దతు తెలుపుతానని పవన్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉంటే మంగళగిరిలో ఎందుకు దీక్ష చేస్తున్నావ‌ని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని…. అయితే వారికి గ‌తంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రాణాలర్పించింది గుంటూరు జిల్లాకు చెందిన మహనీయుడేనని గుర్తులేదా అని ప్రశ్నించారు. అలాగే విశాఖలో సభ పెడితే తాడేప‌ల్లిలో ఉంటున్న జగన్‌కు విన‌బ‌డ‌ద‌ని.. అందుకే అమరావతిలో దీక్ష చేపట్టానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Exit mobile version