కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు వాయు వేగంతో దేశాలను చుట్టేస్తోంది… సౌతాఫ్రికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారితో ఇప్పుడు బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.. అయితే, ఇప్పటికే పలు రకాల అధ్యయనాల్లో చాలా వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుందని తేలింది.. తాజాగా మరో స్టడీలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌లో వ్యాధి తీవ్రత, ఆస్పత్రిపాలయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని తేల్చింది యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ పరిశోధన.. ఆ స్టడీ ప్రకారం.. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందినా.. దాంతో తీవ్ర అస్వస్థతకు గురకావడం, ఆస్పత్రల్లో చేరాల్సిన ముప్పు మూడింట రెండు వంతులు తక్కువని తేల్చింది.
డెల్టా, ఒమిక్రాన్‌పై స్కాట్లాండ్‌లో ఓ స్టడీ నిర్వహించారు పరిశోధకులు.. గతంలో ప్రపంచాన్ని వణికించిన డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో ఆస్పత్రిలో చేరే అవకాశం 80 శాతం తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.. మరోవైపు.. ఒకసారి ఆస్పత్రిలో చేరితే తీవ్ర వ్యాధి బారినపడే ముప్పు మాత్రం రెండు వేరియంట్లలో ఒకే విధంగా ఉందని సౌతాఫ్రికాలో నిర్వహించిన మరో స్టడీ పేర్కొంది.. ఇంకోవైపు.. డెల్టాతో పోలిస్తే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆస్పత్రిలో చేరాల్సిన ముప్పు మూడింట రెండు వంతులు తగ్గుతుందని.. ఒమిక్రాన్ అధిక జనాభాపై స్వల్ప ప్రభావం చూపుతుందని రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జేమ్స్ నైస్మిత్ తెలిపారు.. ఇలా డెల్టా వేరియంట్‌తో పోలుస్తూ ఒమిక్రాన్‌పై రకరాల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.. కాగా, భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇప్పటికే భారత్‌లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 236కు చేరగా.. ఇప్పటి వరకు 104 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 64, తెలంగాణలో 24, రాజస్థాన్‌లో 21, కర్ణాటకలో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదైన విషయం తెలిసిందే.