ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, ఒమిక్రాన్ పిల్లలపై పెను ప్రభావమే చూపిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో.. అమెరికా, యూరప్‌ల్లో అధికశాతం చిన్నారులు.. ఆస్పత్రుల్లో చేరుతున్నారు.అయితే కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ద్వారా వీటికి కళ్లెం వేయవచ్చంటున్నారు నిపుణులు.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అనేక దేశాల్లో కొవిడ్ మూడో దశ మొదలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ వేరియంట్ పిల్లలపైనా అధికంగానే ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొదటి రెండు దశల సమయంలో పిల్లలపై అంతగా ప్రభావం చూపని కరోనా.. థర్డ్ వేవ్‌లో మాత్రం అధికంగానే ప్రభావం చూపుతోంది. నిబంధనలు పాటించకపోవడం, ఆంక్షలు సడలించడం కారణమంటున్నారు నిపుణులు.
మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ .. పిల్లలకు త్వరగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే అధికశాతం ప్రజలు నిబంధనలు పాటించకపోవడం మరో కారణమంటున్నారు. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, రాష్ట్రాలు ఆంక్షలను సడలించడం మరికొన్ని కారణాలుగా చెబుతున్నారు. అయితే వైరస్ బారిన పడే పిల్లల సంఖ్య మరీ అధికంగా లేదంటున్నారు. డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్ర వ్యాప్తిని కలిగి ఉండటంతోపాటు ఆర్-వాల్యూ పెరిగిపోవడం కూడా పిల్లలపై ప్రభావం చూపుతోంది. కొవిడ్ సోకి అమెరికాలోని ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోందని నివేదికలు తెలుపుతున్నాయి.