ప్రపంచాన్ని ఒమిక్రాన్ కేసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత దేశంలోనూ కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. ఏపీలో బుధవారం ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. రావులపాలెం మండలం ఊబలంకలో మూడు ఒమిక్రాన్ కేసులతో అప్రమత్తం అయ్యారు అధికారులు.
ఒమిక్రాన్ కేసులు నమోదైన ప్రాంతంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు పంచాయతీ సిబ్బంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన 59 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ అని తేలింది. లోకల్ కాంటాక్ట్స్ గా అతని భార్య కుమారుడికి కూడా ఒమిక్రాన్ సోకింది. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 136 కరోనా పాజిటివ్ కేసులు వున్నట్టు వైద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వందశాతం పూర్తయింది. 75 శాతం మందికి రెండో టీకా పూర్తయింది. ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో అధికారులు ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారిపై నిఘా పెంచారు.