జేఈఈ మెయిన్స్ 2021 మార్చి సెషన్ పరీక్షలు రేపే ప్రారంభం కానున్నాయి. కరోనా ప్రభావం నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులు ప్రత్యేక గైడ్‌లైన్స్‌తో పాటు డ్రెస్‌కోడ్ పాటించాలి. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్షకు నిబంధనలన్నీ తప్పక ఫాలో కావాలి. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 660 నుంచి 828కు పెంచింది ఎన్టీఏ… అలాగే గతంలో 232 నగరాల్లో జరిగే ఈ పరీక్షలు ఈసారి 334 సిటీస్‌లో జరగనున్నాయి. అలాగే ఎన్టీఏ.. ప్రత్యేక మార్గదర్శకాలు, నిబంధనలు విధించింది. పరీక్ష రాయనున్న అభ్యర్థులు వీటిని తప్పకుండా పాటించాల్సిందే. పరీక్షకు వచ్చే అభ్యర్థులంతా మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. అలాగే కేంద్రాల వద్ద కూడా అభ్యర్థులకు మాస్కులు పంపిణీ చేస్తారు. అలాగే పరీక్ష కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కాంటాక్ట్‌లెస్‌గా ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా భౌతిక దూరం పాటించాలి. అలాగే భౌతిక దూరం నిబంధన మేర కేంద్రాల్లో సీటింగ్ ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు హ్యాండ్శానిటైజర్ అందిస్తారు. ఒక షిఫ్ట్‌లో వాడిన కంప్యూటర్లను ఆ రోజు మరో షిఫ్ట్‌కు వినియోగించరు. అలాగే కేంద్రాల వద్ద అభ్యర్థులు గుమికూడకుండా రిపోర్టింగ్ కోసం స్లాట్లను కేటాయించారు. దాన్ని బట్టి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు వెళ్లాలి.
పరీక్ష కోసం వచ్చే అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో మెటాలిక్ ఐటెమ్స్ ధరించకూడదు. ఎలాంటి ఆభరాణాలు వేసుకోకూడదు. కనీసం ముక్కు పుడక కూడా ఉండకూడదు. అలాగే ఉంగరాలు, గాగుల్స్, బ్రాస్లెట్స్లాంటివి పూర్తిగా నిషిద్ధం. లైట్‌వెయిట్‌గా, అనుకూలంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది. ఇలా అయితే ఎగ్జామ్ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే దళసరి సోల్స్ఉండే చెప్పులు, బూట్లను అనుమతించరు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పరీక్షకు తీసుకెళ్లకూడదు. గాడ్జెట్లను అసలు అనుమతించరు. అలాగే ఎలాంటి టెన్షన్ లేకుండా అరగంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిది. అలాగే అడ్మిట్ కార్డులు, ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.. జేఈఈ మెయిన్స్ పరీక్షను దాదాపు ఆరు లక్షల మంది అభ్యర్థులు రాయనున్నారు. పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసేంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన నిబంధనల మధ్య ఎగ్జామ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. అలాగే అభ్యర్థులు కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చేయడంతో పాటు కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పక్కాగా అమలు చేయనుంది.