ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.. ఆయన ఇచ్చే ఆదేశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంటుంది.. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని దేశాలను కలవరానికి గురిచేస్తుండగా… కోవిడ్ కట్టడానికి అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ తరుణంలో కిమ్ షాకింగ్ ప్రకటన చేశారు.. కోవిడ్ వ్యాక్సిన్ తమకు అవసరం లేదని ప్రకటించారు.. దీనికి బదులుగా తమదైన శైలిలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, కరోనా కట్టడి కోసం పేద దేశాలకు సహాయం చేసేందుకు ‘కొవ్యాక్స్’ కార్యక్రమం కింద ఐక్యరాజ్య సమితి.. టీకాలు ఇవ్వాలనుకుంది.. కానీ, వాటిని తిరస్కరించారు కిమ్.. తాజాగా జరిగిన పొలిట్‌బ్యూరో భేటీలో కిమ్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
మరోవైపు.. ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతుంటే.. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాకు సమీపంలో ఉన్న ఉత్తర కొరియాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని ఆ దేశం చెబుతూ వచ్చింది.. మరోవైపు.. కోవిడ్ కారణంతో ఉత్తర కొరియా చాలా దీన పరిస్థితులను ఎదుర్కొంటుందనే వార్తలు కూడా వచ్చాయి.. కానీ, తాజాగా జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో.. కరోనా మహమ్మారి విషయాన్ని ప్రస్తావించిన కిమ్.. మహమ్మారి వ్యాప్తి నిరోధంలో ఇకపైనా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య కార్యకర్తలకు తగు విధంగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఉత్తర కొరియా విషయాలు, కిమ్ వ్యవహారానికి సంబంధించిన వార్తలు రకరకాలుగా ఎప్పుడూ చక్కర్లు కొడుతుండే సంగతి తెలిసిందే.