Site icon NTV Telugu

మూగబోయిన హుజూరాబాద్‌…

huzurabad

huzurabad

గత మూడు నెలలుగా హుజూరాబాద్‌లో ప్రచార హోరు లేని రోజు. ప్రధాన పార్టీల సందడే సండది. అయితే ఉన్నట్టుండి నియోజకవర్గం సైలెంట్‌ అయ్యింది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు సడన్‌గా నియోజకవర్గాన్ని వీడారు. అక్కడి వీధులు..సందులు ..గొందుల్లో నిశ్శబ్దం ఆవరించింది.

ఇక్కడ ప్రచారం చేస్తోన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నియోజకవర్గం దాటి వెళ్లటమే ఈ సైలెన్స్‌కు కారణం. అప్పటి వరకు అక్కడి రోడ్ల మీద హల్‌ చల్‌ చేసిన ఖరీదైన కార్లు హుజూరాబాద్‌ను వదలిపోవటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఈ ప్రచార సందడి నుండి వారికి కొంత ఉపశమనం కలిగినట్టయింది.

బీజేపీ అభ్యర్థిగా బావిస్తున్న ఈటల రాజేందర్, ఆ పార్టీ ఎన్నికల ఇంచార్జీ జితేందర్‌ రెడ్డితో పాటు వేలాది మంది మద్దతుదారులు నిర్మల్‌లో జరిగిన అమిత్‌ షా బహిరంగ సభకు తరలివెళ్లారు. అంతకు ముందు ఈటల తెలంగాన విమోచన దినం సందర్భంగా జమ్మికుంటలో త్రివర్ణ పతాకం ఎగరేశారు. కేసీఆర్‌ది నియంతృత్వ పాలన అంటూ విమర్శించారు. కేసేయార్‌ నియంతృత్వ పాలన అంతం హుజూరాబాద్‌ నుంచే ప్రారంభం కావాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.

మరోవైపు, ప్రచారంలో మునిగివున్న టీఆర్‌ఎస్‌ మంత్రులందరూ క్యాబినెట్‌ మీటింగ్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లారు. కాగా ఆర్థిక మంత్రి హరీష్‌ రావు జీఎస్టీ మీటింగ్‌ కోసం వెళ్లారు. టీఆర్‌ఎస్‌ ప్రచార బృందానికి ఆయనే సారధ్యం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ విషయానికొస్తే దారులన్నీ గజ్వేల్‌ వైపు మళ్లాయి. ఆ పార్టీ క్యాదర్‌ అంతా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాల సభకు వెళ్లారు. అయితే నేతలంతా తిరిగి ఒకటి రెండు రోజుల్లో మళ్లీ ప్రచారం పాల్గొనే అవకాశం ఉంది.

మరోవైపు, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అర్హులైన దళిత కుటుంబాలన్నీ దళితబంధు పథకం ద్వారా లబ్దిపొందుతాయని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌ వీ కర్నన్‌ హామీ ఇచ్చారు. జమ్మికుంట మండలంలోని నాగునూరు, హుజారాబాద్‌ మండలంలోని రాజాపూర్‌లో జరిగిన దళిత బంధు సర్వేని కలెక్టర్‌ శుక్రవారం పరీశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ముచ్చటించారు. ఎలాంటి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులకు తెలంగాణ దళిత బంధు పేరుతో కొత్త ఖాతాలు తెరవాలని ఆయన బ్యాంకులకు సూచించారు. డబ్బు మంజూరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మరింత లాభదాయకమైన యూనిట్లను స్థాపించడం ద్వారా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారాయన. లబ్ధిదారులు తమకు సొంత భూమి ఉంటే అందులో పాడి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్‌ చెప్పిన దానిని బట్టి హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమలు జోరుగా సాగుతుందని తెలుస్తోంది. దీనిపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది!!

Exit mobile version