రోజురోజుకు మోసాలు చేసేవారు కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. బహుమతులంటూ, ఉద్యోగాలంటూ సామాన్యుడి ఆయువుపట్టుపై కొడుతూ వారి జీవితాలను విలవిలలాడిస్తున్నారు. సైన్ అనే వెబ్‌సైట్‌లో ఓ అమ్మాయి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దాని ఆధారంగా ఆ అమ్మాయి కి కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేశారు దుండగులు. ఎయిర్ టికెటింగ్ స్టాఫ్‌గా ఇండిగో ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎనిమిది లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత స్పందించకపోవడంతో సదరు యువతి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీకి వెళ్ళి కాల్ సెంటర్ పై పోలీసులు రైడ్ చేశారు. కాల్ సెంటర్‌లో ఉద్యోగాల పేరుతో అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్న నైజీరియన్ ముఠాలను అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఈ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ నైజీరియన్ ముఠా బహుమతుల పేరుతో అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నట్లు కూడా దర్యాప్తులో తెలిసిందని పోలీసులు వెల్లడించారు.
ఇద్దరు నైజీరియన్స్ ను అరెస్ట్ చేసిన సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు, కాల్ సెంటర్ జాబ్ ఫ్రాడ్ కేసులో మరో గ్యాంగ్ అరెస్ట్ చేశారు. బహుమతులు, కాల్ సెంటర్‌లో ఉద్యోగాలు పేర్లతో జరిగిన మోసాల్లో మొత్తం పది మంది నిందితుల అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని మయూరు విహార్ లోని కాల్ సెంటర్ పై దాడి చేశామని, అరెస్టైన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాను మరోసారి కస్టడీలోకి తీసుకుంటే ఎంతో మందిని మోసం చేశారో తెలుస్తోందని డీసీపి గజరావు భూపాల్ పేర్కొన్నారు.