ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.. భారీ మార్పులకు పూనుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. దానికి తగ్గట్టుగానే అధిష్టానం.. రాష్ట్రానికి చెందిన నేతలతో విడివిడిగా సమావేశం కూడా అయ్యింది.. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న శైలజానాథ్ ను మార్చాలని అధిష్ఠానం నిర్ణయానికి రాగా.. కొత్త అధ్యక్షుడి వేటలో పడింది.. దీని కోసం పరిశీలనలో చింతామోహన్, జేడీ శీలం, హర్షకుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీతో మరోవిడత ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారని సమాచారం.
సెప్టెంబర్ మొదటి వారంలో సమాలోచనల తర్వాత నిర్ణయం కొత్త పీసీసీ చీఫ్‌పై ఏఐసీసీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.. కొత్త నాయకత్వంలో ఏపీ కాంగ్రెస్ కు నిర్దిష్టమైన కార్యాచరణను నిర్దేశించనుంది ఏఐసీసీ.. మరోసారి సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీకి చెందిన మరికొంత మంది ముఖ్య నేతలను ఢిల్లీ కి రావాలని అధిష్ఠానం నుంచి పిలుపు అందినట్టుగా సమాచారం.. నేరుగా ఏపీ ముఖ్యనేతల అభిప్రాయాలను తెలుసుకుని, అంతిమంగా నిర్ణయం తీసుకోనున్నారు రాహుల్ గాంధీ.. కాగా, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ దృఢ నిశ్చయంతో ఉన్నారు.. రాష్ట్ర నేతల అభిమతం మేరకు ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డా. చింతా మోహన్, కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ సెక్రటరీ జేడీ శీలం, మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్లను ఏపీ కాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ ఉమెన్ చాందీ సిఫార్సు చేసినట్లు సమాచారం.. ఇటీవల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో, జిల్లా స్థాయు నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు ఉమెన్ చాందీ, ఇంఛార్జ్ సెక్రటరీలు మయ్యప్పన్, క్రిస్టోఫర్.. వారి అభిప్రాయాలను అధిష్టానానికి ఇప్పటికే చేరవేశారు. తెలంగాణకు కొత్త చీఫ్‌ను ప్రకటించిన పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచిన అధిష్టానం.. ఇప్పుడు.. ఏపీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
