ఏపీలో వేతనాలు, పెన్షన్లపై చీఫ్ సెక్రెటరీ లెక్కలు ఉద్యోగుల్నీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. 111 శాతం ఖర్చు చేస్తున్నట్టు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, పించన్లపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని అన్నారు. ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని, రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఎందుకు ఈ విషయం ప్రస్తావించలేదని అన్నారు. అసెంబ్లీలో లెక్కలు పక్కాగా చెప్పాల్సి ఉంటుందని, ఈ తప్పుడు లెక్కల నివేదికను ఎవర్ని మోసపుచ్చడానికి తయారు చేయించారని ప్రశ్నించారు.
Read: వీడి కక్కుర్తి తగలయ్య… కరోనాకు భయపడి 10 వ్యాక్సిన్లు తీసుకున్నాడట…
ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీచేశారో చెప్పాలని అన్నారు. నెలకు ఉద్యోగుల జీతాలకు, పెన్షన్ల కోసం రూ. 4600 కోట్లు ఖర్చు అవుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయని, ఈ విషయం నిజం కాకపోతే చీఫ్ సెక్రటరీ, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎందుకు ఖండించలేదని, ఏటా 67 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఎందుకు ప్రకటించలేదని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తరువాత నియమించిన వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జీతాలను కేంద్రం ఇచ్చే నిధుల నుంచే మళ్లిస్తున్నారని, ఏ దశలో రాష్ట్రప్రభుత్వం ఖజానాకు భారం పడుతుందో పారదర్శకంగా చెప్పాలని అన్నారు. ప్రతీ ఏటా ప్రభుత్వ ఉద్యోగం నుంచి సుమారు 15 వేల మంది రిటైర్ అవుతున్నారని, ఆ మేరకు భర్తీ జరగడంలేదని నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని, మరి ఏ విధంగా వ్యయం పెరిగిందో వెల్లడించాలని జనసేన నేత ప్రశ్నించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కంటే ఎక్కువగా జీతాలకు ఇస్తున్నామని చెప్పడం ఆర్థికశాఖ దివాళాకోరుతనాన్ని వెల్లడిస్తుందని, ఈ తప్పుడు లెక్కలపై ప్రతి ఉద్యోగి ప్రశ్నించాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.