ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో జరిగిన క్రాస్ ఓటింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అభివృద్ధి పనులు, ప్రజాసేవనే ప్రజలు గుర్తుంచుకుంటారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని, సౌమ్యుడైన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాదిరిగా కొంత కఠినంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత తాతా మధుసూదన్ అన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ అభినందన సభ అశ్వారావుపేటలోని మాధురి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి ఎమ్మెల్సీ తాతా మధులను గజమాలతో సన్మానించారు. రాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఉమ్మడి జిల్లాను మాజీమంత్రి తుమ్మల నిలబెట్టారని, తన గెలుపులో ఎక్కువ భాగం శ్రమించిన ఎమ్మెల్యే సండ్రకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది వ్యక్తులు పార్టీకి నష్టం కలిగించే పనులు చేశారని, ఇలాంటి ప్రయత్నాలతో టీఆర్‌ఎస్‌ను ఏమీ చేయ్యలేరని అన్నారు. పార్టీ పునఃనిర్మాణానికి పనిచేస్తానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై సమగ్రంగా విశ్లేషణ చేయాల్సి ఉందన్నారు. పార్టీలో వుండాలంటే అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా వుంటే క్రాస్ ఓటింగ్‌పై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.