Site icon NTV Telugu

ఆన్ లైన్ తప్పని సరి: మంత్రి పేర్ని నాని స్పష్టం

సినిమా టికెట్ ఆన్ లైన్ అనేది తప్పని సరి వ్యవహారంగా ఎపి మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం చిత్ర ప్రముఖులతో జరిగిన సమావేశంలో సినిమా పరిశ్రమతో పాటు థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా సినిమా టికెట్ రేట్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమావేశంలో ఒక ఎగ్జిబిటర్ కన్నీటి పర్యంతం అవటం సమస్య తీవ్రతను తెలియచేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లతో థియేటర్స్ రన్ చేయలేం అంటూ అతడు కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. చిత్ర పరిశ్రమకు చెందిన ఆదిశేషగిరిరావు, యువి క్రియేషన్స్ వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సి. కళ్యాణ్, డివివి దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, పంపిణీదారులు ఎల్వీఆర్, సత్యనారాయణ, వీర్రాజు, అలంకార్ ప్రసాద్, ఒంగోలు బాబు తో పాటు పలువురు థియేటర్ల యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

టికెట్ రేట్లతో పాటు నూరు శాతం ఆక్యుపెన్సీ, సెకెండ్ షోకు అనుమతి వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడి ఆదేశాలు వచ్చేలా చూస్తానని మంత్రి నాని హామీ ఇచ్చారు. ఆన్ లైన్ టికెటింగ్ ప్రతిపాదనకి సినిమా ప్రతినిధులు కూడా ఆమోదముద్రవేశారు. అయితే టికెట్ రేట్లను మాత్రం ప్లెక్సిబుల్ గా ఉండేలా 50 నుంచి 250 మధ్యలో ఉండేలా చూడాలని కోరారు. దాని వల్ల సినిమా స్థాయికి అనుగుణంగా తాము రేట్లు మార్చుకుంటామని ప్రతినిధులు కోరారు. దీనిని కూడా సిఎమ్ దృష్టికి తీసుకెళ్లానని మంత్రి హామీ ఇచ్చినట్లు వినిపిస్తోంది. మరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సినిమా వారి కోరికలను మన్నిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Exit mobile version