ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 ఏళ్ళ కల అది. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావాలని కోరుకున్నారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆదివాసీలు తమ కల సాకారం అయినందుకు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. 30 నివాస సముదాయాలున్న ఆదివాసీ గ్రామం మంగీ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఆర్టీసీ బస్సు శబ్దం వినిపిస్తోంది. రయ్యి రయ్యి మంటూ దూసుకువస్తున్న ప్రజారవాణా వ్యవస్థను అక్కడి మహిళలు, పిల్లలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని మంగీ గ్రామ పంచాయతీకి సరైన రోడ్డు సౌకర్యం లేదు. వివిధ కారణాల వల్ల రోడ్డు నిర్మాణం జరగలేదు. ఎంతోమందిని కలిశారు. ఎన్నికల్లో నేతలు కూడా వచ్చి వెళ్ళారు. కానీ వారికి ఒరిగిందేం లేదు. రోడ్లు పడలేదు. వెతలు తీరలేదు. చివరకు వారికి కలను సాకారం చేసింది మాత్రం పోలీసులు. స్థానిక నేతలు, ట్రాక్టర్ యజమానుల సహకారంతో మంగి నుంచి మాణిక్యాపూర్ వరకూ వున్న ఘాట్ రోడ్డుని నిర్మించుకున్నారు. ట్రాక్టర్ల యజమానులు, గ్రామస్థుల శ్రమదానంతో చక్కని రోడ్డు ఏర్పడింది.
గతంలో భారీవర్షాలు పడితే కొండల పై నుంచి వచ్చే బండరాళ్ళతో ఘాట్ రోడ్డు ఇబ్బందిగా వుండేది. దీనికి తోడు మావోయిస్టుల ప్రాబల్యం కూడా వుంది. దీంతో అక్కడికి బస్సు నడిపే సాహసం ఎవరూ చేయలేదు. చివరకు ఇప్పుడు పోలీసుల సహకారంతో రోడ్డు బాగుపడింది. ఈ గ్రామం నుంచి కొండలు ఎక్కి దిగి తిర్యానీ మండలానికి వెళ్ళి వచ్చేవారు. ఏదైనా అనారోగ్యం కలిగితే అంతే సంగతులు. ఇప్పుడు చక్కగా రోడ్డు పడడం, బస్సులు తిరగడంతో ఆదివాసీలు మండల కార్యాలయానికి వెళ్లి వస్తున్నారు. అంతేకాదు కూరగాయలు, నిత్యావసరాల తెచ్చుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. గ్రామస్తుల కలను తీర్చింది మాత్రం తిర్యానీ సబ్ ఇన్ స్పెక్టర్ పుష్పాల రామారావు. ఆయన చొరవతో ఆర్టీసీ అధికారులు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.