మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర బోడ్ ప్రైమరీ పాఠశాలకు తాళం వేశారు. దీంతో పాఠశాల ముందే విద్యార్థులు పడిగాపులు పడుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా తీరు మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర బోడ్ లోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పొన్నమ్మ సమయపాలన పాటించడం లేదు.
పిల్లలను సరిగా పట్టించుకోకపోవడం, చదువులు సరిగా బోధించకపోవడం, విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు పాఠశాలకు సంబంధించిన బడ్జెట్ విషయంలో బడి చైర్మన్ తో సంబంధం లేకుండా నిధులు డ్రా చేసుకుంటూ తన ఇష్టానికి వాడుకున్నట్లు పిల్లల తల్లిదండ్రులు, బడి ఛైర్మైన్ వాపోతున్నారు. రోజూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చి త్వరగానే ముగించి వెళ్ళిపోతోందని వారు చెబుతున్నారు.
ఇలా అయితే పిల్లలకు చదువులు ఎలా వస్తాయని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఉదయం 9.30 అవుతున్నా పాఠశాల తాళం తీయకపోవడం దారుణం. పిల్లలు పుస్తకాలతో బడకి రాగానే తాళం వేసి ఉండటంతో ఖంగుతిన్నారు. ఇప్పటికైనా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.